VMC Incresing Park Fees Vijayawada : విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక పక్షం ప్రజలపై పన్నుల భారం మోపడానికి తహతహలాడుతుందని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరపాలక సంస్థలో జరిగిన స్థాయి సంఘం సమావేశం ఎజెండా అంశాలలో పార్కులో ప్రవేశ రుసుం వసూలు, స్టేడియాల్లో ఆడే క్రీడాకారుల నుంచి సభ్యత రుసుం పేరుతో ఫీజులు వసూలు చేయాలనే అంశాలు ఉండటంపై సీపీఎం అభ్యంతరం తెలిపింది.
నెలవారి ఫీజులు వసూలు చేస్తే నగర ప్రజలతో పాటు క్రీడాకారులపైనా మరింత భారం పడుతుందని సీపీఎం వీఎంసీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు విమర్శించారు. అలాగే వీఎంసీ పరిధిలోని ఇండోర్ స్టేడియాల నిర్వాహణ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు.
నగరవాసులపై ఎడాపెడా పన్నుల మోత- 'ఎన్నికల్లో జగన్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక'
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఎంసీ నిర్వహణలో ఉండే ఇండోర్ స్టేడియంలలో బ్యాడ్మెంటన్ ఆడే క్రీడకారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని భావించడం కరెక్ట్ కాదన్నారు. ఇండోర్ స్టేడియాల్లో బ్యాడ్మింటన్ ఆడే పెద్దలకు సభ్యత్వ రుసుం పేరుతో 2000 రూపాయలతో పాటు నెలవారీ ఫీజు 800 రూపాయలు వసూలు చేయాలనే అంశం ఎజెండాలో పెట్టడంపై మండిపడ్డారు. విద్యార్థులకు సభ్యత్వ రుసుము 1000 రూపాయలతో పాటు నెలవారీ ఫీజు 400 రూపాయలు వసూలు చేయాలని భావించడం సమంజసం కాదని తెలిపారు. ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సత్యబాబు కోరారు.
విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు
ప్రజలపై పన్నుల భారం మోపేందుకు విజయవాడ నగరపాలక సంస్థలోని వైఎస్సార్సీపీ పాలక పక్షం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల పాలనలో నగర ప్రజలపై ఆస్తి, చెత్త, నీటి పన్నులు పెంచి వందల కోట్ల రుపాయలు ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రస్తుతం పార్కులపై విధిస్తున్న రుసుములు పెంచితే సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన 500 కోట్ల రుపాయల గ్రాంట్లను విజయవాడ నగరానికి రప్పించుకుంటే ఇక్కడి ప్రజలపై పన్నుల భారం పడకుండా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.
కానీ వైఎస్సార్సీపీ పాలక పక్షం దీనిపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రజలపై భారం మోపడానికే మెుగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వల్లే గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. అయిన తీరు మార్చుకోకుండా అదే బాటలో వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజవ్యతిరేకమైన నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నేత సత్యబాబు డిమాండ్ చేశారు.