Contaminated Drinking Water Problem in Vijayawada : విజయవాడలోని మొగల్రాజపురం ప్రజలు కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వారం రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇంటిల్లిపాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అనేక మంది ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నారని వెల్లడించారు. కలుషిత నీటి సమస్యపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీస సహాయం అందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడులో కథనాలు వచ్చిన తర్వాతే వైద్య ఆరోగ్యశాఖ, కార్పొరేషన్ సిబ్బంది ఇక్కడకు వచ్చారని స్థానికులు అంటున్నారు.
కలుషిత నీటి అంశంపై అధికారుల చర్యలు - ఆరుగురు సస్పెండ్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
కలుషిత నీటితో వందలాది మందికి అస్వస్థత : గత వారం రోజులుగా అనేకమంది బెజవాడలోని మొగల్రాజపురంలోని ప్రజలు వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 31మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సహాయం అందలేదని వాపోతున్నారు. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్లో తమ సమస్య ప్రసారం అయిన తరువాత ఈ రోజు ఉదయం నుంచి తమ వద్దకు వైద్యారోగ్య శాఖ, వీఎంసీ సిబ్బంది వచ్చి తమ ఆరోగ్య పరిస్థితి గురించి అడుగుతున్నారని స్థానికులు మండిపడ్డారు.
నీటి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్న సిబ్బంది : ఇదే అంశంపై అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం కలుషిత నీటి సమస్య అదుపులోనే ఉందన్నారు. ఇప్పటికే నీటి నమూనాలను సేకరించామని, పరీక్షలు నిర్వహించిన తరువాత వివరాలు వెళ్లడిస్తామని తెలుపుతున్నారు. మొగల్రాజపురం ఏరియాలో వివిధ కాలనీల్లో వీఎంసీ, వైద్యారోగ్య సిబ్బంది సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహించారు. నీటి కాలుష్యం కారణంగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారా? లేదా ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా? అన్నది రిపోర్టులు వచ్చాక వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో పైపులైన్లు మరమ్మతులు చేపడుతున్నామని, వాటర్ ట్యాంకులు శుభ్రం చెయ్యిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు ఐదు వందల ఇళ్లల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. కలుషిత నీరు కారణంగానే తన భర్త దుర్గారావు మరణించాడని స్థానిక మహిళ నాగమణి చెబుతున్నారు. ఇంటి పెద్ద మరణించడంతో తమ కుటుంబానికి ఎవ్వరూ దిక్కులేకుండా పోయారని, ప్రభుత్వమే ఆదుకోవాలని నాగమణి కోరుతున్నారు.
"నగరంలో కలుషిత నీటి సమస్య ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఇప్పటికే నీటి నమూనాలను సేకరించాము. పరీక్షలు నిర్వహించిన తరువాత వివరాలు వెల్లడిస్తాం. మొగల్రాజపురం కాలనీలను వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహించాము. అస్వస్థతకు గురైన వారి కోసం ఇప్పటికే విజయవాడ సర్వజన ఆసుపత్రిలో 30 పడకలు అందుబాటులో ఉంచాము. అలాగే మెడికల్ క్యాంపు వద్దకు వస్తున్న వారికి మందులు ఇస్తున్నాం. అదేవిధంగా వారు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెబుతున్నాం." - స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వీఎంసీ కమిషనర్
ఇప్పటికైన శుభ్రమైన తాగునీరు అందించండి : తమకు తాగడానికి శుభ్రమైన మంచినీరు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీఎంసీ అధికారులు, సిబ్బంది నగరంలోని పారిశుద్ధ్యం పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. కలుషిత నీటిపై పూర్తి విచారణ జరిపి శుభ్రమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు- గుంటూరు ఘటనపై టీడీపీ నేతల ఆగ్రహం
ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు