Compensation to Michaung Cyclone Affected Farmers: రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో మిగ్‌జాం తుపాను కారణంగా పంట నష్టం జరిగితే రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌కు మనసు రాలేదు. అన్నదాతల ఆవేదన వినిపించుకునే తీరికా లేకపోయింది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు పర్యటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాపట్ల, తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడ బురద అంటుకుంటుందో అన్నట్లుగా రెడ్ కార్పెట్‌పై వెళ్లి పరామర్శించారు. కరవు కరాళ నృత్యం చేస్తున్నా, పంటలు ఎండుతున్నా, రాష్ట్రంలో కరవు ఎక్కడుందని నిర్లక్ష్యం వహించారు.
450 పైగా మండలాల్లో కరవు పరిస్థితులుంటే ప్రభుత్వం మాత్రం కేవలం 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించి మమ అనిపించారు. మిగ్‌జాం తుపాను కారణంగా 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 1.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని కేంద్ర బృందానికి నివేదించింది. తీరా పంట నష్టం లెక్కలు పూర్తయ్యేసరికి మాత్రం మొత్తం 6.64 లక్షల ఎకరాలే అని తేల్చేశారు. బాధిత రైతులకు 12 వందల 89 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేయాలని తేల్చారు. అంటే ఎకరాకు సగటున 6 వేల 175 మాత్రమే. గడువు దాటినా వాటి ఊసే ఎత్తడం లేదు.
ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంలో 27 శాతం సాగు తగ్గింది. 31 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానపంటలు వేయలేదు. అయినా ప్రభుత్వానికి కరవు తీవ్రత కనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరవు కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కోస్తా, రాయలసీమల్లో పత్తి, మినుము, వేరుసెనగ, కంది తదితర పంటలు ఎండిపోయాయి. అధిక విస్తీర్ణంలో మిరప తొలగించారు. మిగ్‌జాం ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోతకొచ్చిన వరి నేల కరచింది.
కోసిన పనలు నీళ్లలో తేలాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి రంగు మారింది. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ వరి పంటి మునిగిపోయి పనలు నీటిలో తేలియాడాయి. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఉద్యానపంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. ఖరీఫ్‌లో మొదలైన కరవు రబీలోనూ రైతుల్ని వెంటాడింది. అక్టోబరు, నవంబరుల్లో వానల్లేవు. డిసెంబరులో తుపాను తుడిచేసింది. జనవరిలో సాధారణం కంటే 77 శాతం తక్కువ వానలు కురిశాయి.
సాధారణ విస్తీర్ణం 56లక్షల ఎకరాలు కాగా, జనవరి నెలాఖరు వరకు పరిశీలిస్తే 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే 21 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 20 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉంటే, 11.40 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితులతో రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం జగన్ మాత్రం పెట్టుబడి సాయంపై మాటల తప్ప నిధులు విడుదల చేయడం లేదు.