CM Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసులు తీరుకు నిరసనగా డాబా కొట్ల సెంటర్‌లో కాలనీవాసులు రాస్తారోకో నిర్వహించారు. 200 రూపాయలు ఇస్తామని రోడ్ షోకు తీసుకెళ్లారని వడ్డెర కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను వదిలి పెట్టకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఉదయం నుంచీ తమ పిల్లల ఆచూకీ తెలియడం లేదని అన్నారు.
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో వడ్డెర కాలనీకి చెందిన యువకులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈరోజు తెల్లవారుజామున ఐదుగురు మైనర్లను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో ఒకరు రాయి విసిరినట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు.
జగన్‌పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan
ఈ క్రమంలో అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై తల్లిదండ్రులు, కాలనీవాసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డెర కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ఈరోజు ఉదయం తమ పిల్లలను తీసుకెళ్లిన పోలీసులు ఇంతవరకూ తిరిగి పంపలేదని మండిపడ్డారు. వడ్డెర కాలనీ సెంటర్‌లో ప్రధాన రహదారిపై సామానులు అడ్డుగా పెట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగన్ పేరు చెప్పి పెట్రోల్ పోసుకుని చచ్చిపోతామని హెచ్చరిస్తున్నారు. ఉదయం పోలీసులు తీసుకెళ్లిన తమ పిల్లల ఆచూకీ ఇంతవరకు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 120 మందికి పైగా అనుమానితులను విచారించారు. సీఎం రూట్లోని సీసీ కెమెరాల విజువల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు దర్యాప్తుకు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మూడు రోజుల నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు.
రాయి దాడి ఘటనపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష- దర్యాప్తును వేగం చేయాలని సూచన - AP CEO Mukesh Kumar Meena