CM Jagan Neglect Weavers in AP : రాష్ట్రంలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేతలకు జగన్ ఇచ్చిన హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన అనంతరం హామీకి ముందు ‘సొంత’ అనే పదాన్ని చేర్చి సొంత మగ్గముంటేనే రూ.24 వేలు ఇస్తామని సీఎం జగన్ మాట మార్చారు. కూలీ మగ్గాలపై నేసే వారందరి నోట్లో మట్టి కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో 3.50 లక్షల మంది కార్మికులుంటే నేతన్న నేస్తం కింద జగన్ ఆర్థికసాయం 80 వేల మందికే అందుతుంది. ఈ ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నానని చెప్పి గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు అమలైన ఇతర పథకాలన్నీ రద్దు చేశారు. ముడి సరకు ఇచ్చే రాయితీని ఎత్తేశారు. మార్కెటింగ్‌కు సహకారం ఇవ్వలేదు. నిల్వలు పేరుకు పోయినా పట్టించుకోలేదు. గుంత మగ్గాల్లో నీరు చేరి అల్లాడినా చెవికి ఎక్కించుకో లేదు. జీఎస్టీ (GST) గుదిబండగా మారినా మిన్నకున్నారు. వీటి అన్నింటికీ తోడు మాస్టర్ వీవర్స్ దగ్గర రోజువారీ కూలీకి వెళ్లే వారికి నేతన్ననేస్తం ఎగ్గొట్టారు. చేనేతలకు 45 ఏళ్లకు పింఛను ఇస్తాననే హామీకి నీళ్లు వదిలారు. 90 శాతం రాయితీతో కేంద్రం ఇచ్చే ఆధునిక పరికరాలను కూడా అందించ లేదు. ఇన్నీ దుర్మార్గాలు చేసింది జగన్ సర్కార్. బీసీలు అంటే ఎంత పగ లేకుంటే ఇన్ని దారుణాలకు ఒడిగడతారు?
కూలీ మగ్గాలపై ఎవరు నేస్తున్నారో గుర్తించడం కష్టమట! : చేనేత కార్మికులు అందరికీ నేతన్ననేస్తం వర్తింపచేయకుండా జగన్ కుట్ర పన్నారు. లేకపోతే 100 మగ్గాలున్న మాస్టర్ వీవర్‌కు ఆర్థిక సాయం అందిస్తూ వాటిపై కూలీలుగా పనిచేసే కార్మికులకు వర్తింప చేయలేదు. రాష్ట్ర ప్రజల సమస్త సమాచారాన్ని తెలుసుకునే వాలంటీరు, గ్రామ సచివాలయ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి కదా! అలాంటప్పుడు మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేస్తున్న కూలీల వివరాలను తెలుసుకోవడం కష్టమా? నేత పనుల్లో అల్లు పోయడం, రంగులు అద్దడం, వార్పింగ్, జరీపోయడం, వైండింగ్, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, డిజైనింగ్ పనులను అనుబంధ రంగాల్లో కార్మికులు పనిచేస్తున్నారు. నిజంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలనే తపనే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉంటే ఎందకు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారో లెక్క తేల్చలేరా?
- రాష్ట్రంలో కంచిపట్టు చీరల నేతకు ధర్మవరం ప్రసిద్ధి. ఇక్కడ 33,000 మంది చేనేత వృత్తిలో ఉండగా నేతన్ననేస్తం సాయం 10,000 మందికే అందింది. మిగతా వారిలో 15,000 మంది కూలీలు మగ్గాలు నేస్తున్నారని, 8,000 చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారని సాయం అందించరట. రోజుకు 400 రూపాయలు సంపాదించే వీరంతా జగన్ దృష్టిలో ధనవంతులుగా కనిపిస్తున్నారమో. ఇది ఒక్క ధర్మవరానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఉన్న ప్రతి చోట ఇలాంటి పరిస్థితే ఉంది.
- గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్‌లో 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరిలో సొంత మగ్గాలున్న 488 మందికి ఉన్నారు. వీరికి 5వ విడతలో నేతన్ననేస్తం అందించారు. మాస్టర్ వీవర్స్ వద్ద, సొసైటీల్లో నేసే 700 మందికి, ఇళ్లల్లో అద్దె మగ్గాలపై నేసే మిగతా వారికి నేతన్న నేస్తం పథకం వర్తించలేదు.
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గద్వాల పట్టు చీరలు నేసే కార్మికులు 8,200 మంది ఉన్నారు. అందులో నేతన్ననేస్తం సాయం అందించింది 1,800 మందికే నేతన్న నేస్తం అందించారు. మిగతా 6,400 మంది మాస్టర్ వీవర్స్ దగ్గర కూలీ కింద మగ్గాలు నేసేవారని ఇవ్వలేదు.
- అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలో 2,904 మందికి నేతన్ననేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక్కడ అద్దె మగ్గాలపై నేసే 1,500 మందికి, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న 3000 మందికి జగన్ సర్కార్ మొండిచేయి చూపించింది.
చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers
గుంత మగ్గాల్లోకి నీరు చేరినా : నాలుగు చినుకులు రాలినా, జోరున వర్షం కురిసినా, వాతావరణంలో తేమ శాతం పెరిగినా మగ్గంపై పడుగు, పేక ముందుకు కదలదు. తుపాన్లు పోటెత్తితే కార్మికుల ఉపాధిపై పడే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గుంత మగ్గాలున్న వారి పరిస్థితి మరీ దారుణం ఉంటుంది. మగ్గంపై ఉన్న చీరలు పాడై పోతాయి. మగ్గాలు, రాట్నాలు వర్షానికి దెబ్బ తింటాయి. వర్షం ఆగినా గుంతల్లో నీటి ఊట ఆగదు. మగ్గం పనిచేయడానికి సహకరించదు. ఇలా ఒకటి, రెండు రోజులైతే ఫర్వా లేదు. అదే 20 నుంచి 30 రోజులు అయితే? వాన కాలం మొత్తం ఇదే పరిస్థితి ఎదురైతే? ఆ పేద చేనేత కుటుంబాలు కడుపు నింపుకొనేది ఎలా అన్న విషయం జగన్ సర్కార్ ఆలోచించలేదు.
- 2023 తుపాన్ల సమయంలో వెంకటగిరిలో 800 గుంత మగ్గాల్లో నీరు చేరడంతో కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. మగ్గంపై ఉన్న రూ.20,000 నుంచి రూ. 40,000 విలువైన చీరలు పాడయ్యాయి. ఒక్కో నేత కార్మికుడికి రూ.15,000 నుంచి రూ.30,000 వరకు నష్టం వాటిల్లింది.
- ఎమ్మిగనూరులో 5,000 వరకు గుంత మగ్గాలున్నాయి. 2022 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు గుంతల్లో ఊట నీరు చేరి చీరలు, మగ్గాలు దెబ్బతిన్నాయి
- మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లెలో 6000 మగ్గాలున్నాయి. 2023లో నవంబరు, డిసెంబరులో కురిసిన వర్షంతో నేతన్నలు 25 రోజుల పాటు ఉపాధికి దూరం అయ్యారు. నష్టపోయిన ఏ ఒక్కరికీ జగన్ సర్కార్ పరిహారం ఇవ్వలేదు.
చేనేత సంఘాల్ని నిర్వీర్యం చేశారు : రాష్ట్రంలో 800 పైగా చేనేత సంఘాలు ఉన్నాయి. ఇందులో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా టీడీపీ 0 ప్రభుత్వం మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేశాయి. మూడేళ్ల సగటు అమ్మకాలను తీసుకుని దానిపై 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఒక్కో సంఘానికి 8 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరేది. జగన్ సర్కార్ వచ్చాక దీన్ని పూర్తిగా నిలిపేశారు.
త్రిఫ్ట్ ఫండ్‌ను తీసేశారు : చేనేత సంఘాంలోని కార్మికుల పొదుపును ప్రోత్సాహించేందుకు అప్పట్లో త్రిఫ్ట్ పథకం అమలైంది. నేత కార్మికుడు నెలవారీ ఆదాయంలో 8 శాతం పొదుపు చేసుకుంటే దానికి సమానంగా 8 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో ఈ 8 శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 శాతాలు చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా అప్పటి టీడీపీ సర్కారు తానే మొత్తం 8 శాతం భరిస్తానని హామీ ఇచ్చింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు.
జీఎస్టీ గుదిబండగా మారినా ఆదుకోలేదు : చేనేతలపై జీఎస్టీ (GST) భారం గుదిబండగా మారింది. నూలుపై 5 శాతం, రంగుపై 18 శాతం , రసాయనాలపై 18 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించింది. కరోనాకు ముందు ముడిసరకు 3,200 రూపాయలు వరకు ఉండగా ప్రస్తుతం 5,500 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటి దాకా 6,000 రూపాయలు వరకు ఉంది. అంటే అయిదేళ్లలో దాదాపు రెట్టింపు అయినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు.
టీడీపీ ప్రభుత్వమిచ్చిన పట్టు రాయితీని ఎత్తేశారు : పట్టు చీరలు నేసే కార్మికులకు ముడిసరకు రాయితీ పథకం అనేది అత్యంత కీలకమైనది. దీన్ని నిలిపేసి వారిపై కోలుకోలేని దెబ్బకొట్టింది జగన్ సర్కారు. తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో ఒక్కో చేనేత కార్మికుడికి నెలకు 6 కిలోలకు కిలోపై 200 రూపాయల చొప్పున 1,200 రూపాయలు రాయితీగా అందించింది. అంటే సంవత్సరానికి 14,400 రూపాయలు అన్నమాట! ఆ తర్వాత ముడి సరకు ధరలు పెరగడంతో 2018-19లో నెలకు ఇచ్చే రాయితీని 2,000 రూపాయలకు పెంచింది. అంటే నేత కార్మికునికి సంవత్సరానికి 24,000 రూపాయల రాయితీగా అందినట్టే. దీన్ని మరింత గొప్పగా అమలు చేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ గెలిచాక మడమ తిప్పేశారు.
ముస్లింలకు జగన్ నయవంచన - సంక్షేమంలో ధోకా - Muslims Problems In YSRCP Govt
చేనేత పింఛన్లకు ఎసరు : వృత్తి ఆధారంగా ఎప్పటి నుంచో చేనేత కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు. కొత్తగా పింఛను మంజూరు చేసేందుకు వైఎస్సార్సీపీ సర్కారు ఎక్కడ లేని నిబంధనలు పెట్టింది. మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు, ఆయన దగ్గర తీసుకునే కూలి డబ్బు 2 సంవత్సరాలు నుంచి కార్మికుని బ్యాంకు ఖాతాలో జమైనట్టు ఆధారం చూపించాలే నిబంధన పెట్టారు. ఈ మేరకు మాస్టర్ వీవర్ సైతం ధ్రువీకరణ అందించాలి. సొంత మగ్గం నేసే వారైతే ముడిసరకు కొనుగోలుకు సంబంధించి 2 సంవత్సరాల జీఎస్టీ (GST) చెల్లింపు వివరాలు అందించాలి. ఈ నిబంధనల్ని పెట్టి జనవరికి ముందు కొత్తగా దరఖాస్తు చేసుకున్న చేనేతలు ఎవ్వరికీ పింఛను ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త పింఛన్ల వరకే ఈ నిబంధనల్ని పరిమితం చేశారు. మళ్లీ జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే పింఛన్ల పరిస్థితి ఏమవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.