CM Grant Sanction to Barashahid Dargah: నెల్లూరు బారాషాహీద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల గ్రాంట్‌ను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చిన వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి జూమ్‌లో మాట్లాడారు. ఈ పండుగలో పాల్గొనే భక్తులకు సీఎం శుభాకాంక్షలు తెలిపిన ఆయన వందల ఏళ్లుగా ఒక పవిత్రమైన ప్రాంతంగా బారాషహీద్ దర్గా ఉందని అన్నారు. ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు. ఈ క్షేత్రానికి ఉన్న పవిత్రత, శక్తి కారణంగా ఏడాదికి 10 నుంచి 15 లక్షల మంది రొట్టెల పండుగకు వస్తారని, కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా రొట్టెలు మార్చుకుని తమ కోర్కెలు నెరవేర్చుకుంటారన్నారు.
నెల్లూరు రొట్టెల పండుగ- ఈ ఏడాది భక్తుల సంఖ్యపై అంచనాలు ఇవే - Arrangements for Bread festival
దేవుడిపై నమ్మకంతో ప్రపంచం నడుస్తుందని, ఆ నమ్మకాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కూడా ముందు రోజు వెళ్లి దేవుడిని ప్రార్థించి తమ ప్రయత్నం విజయవంతం అయ్యేలా చూడాలని కోరుకుంటారని గుర్తు చేశారు. లక్షలమంది ఎంతో నమ్మకంగా జరుపుకునే ఈ రొట్టెల పండుగను 2014లో రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దర్గా, స్వర్ణాల చెరువును అభివృద్ధి చేశామని చెప్పారు.
ప్రస్తుతం ప్రార్థనా మందిరం నిర్మాణం నిలిచిపోయిందని మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకురాగా 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని రొట్టెల పండుగకు వచ్చిన భక్తులను సీఎం కోరారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దీని నుంచి బయటపడి సంపద సృష్టి జరగాలని అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలతో సీఎం మాట్లాడారు. తమ కోర్కెలు తీరడంతో తాము రొట్టెలు మార్చుకోవడానికి వచ్చినట్లు ఆ మహిళలు చంద్రబాబు చెప్పారు. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, మంత్రులకు సీఎం సూచించారు.
కోర్కెల రొట్టెలతో నెల్లూరుకు భక్తులు - సందడిగా స్వర్ణాల చెరువు - Nellore Rottela Panduga 2024