CM Chandrababu Participated in Vana Mahotsava Program : ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో ఉమముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పచ్చని కొండతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు వేప, రావి మొక్కలను నాటారు. అలాగే పవన్ కల్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్ చెరో మొక్క నాటారు. ఆకుపచ్చని ఆశయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, పెమ్మసాని, అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
అడవుల సంరక్షణకు డ్రోన్ల వినియోగం : రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఇన్నాళ్లూ ఆడిన ఆటలు ఇక సాగవని, అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామన్న చంద్రబాబు, స్మగ్లర్ల కంటే ముందే డ్రోన్లే అడవుల్లో ఉంటాయని తెలిపారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ మధ్య దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అభివృద్ధి చెందబోతోందని స్పష్టం చేశారు. 32 ఎకో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తమ ఆలోచన హరితాంధ్రప్రదేశ్, ఆశయం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని స్పష్టం చేశారు.
ఎక్కువ మొక్కలు నాటే విద్యార్థులకు అవార్డులు : విద్యార్థులు మొక్క పెంచితే ఆ మొక్కకు ఆ విద్యార్థి తల్లి పేరు పెడతామని సీఎం అన్నారు. జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫొటో వేసుకున్న పనులు తాము చేయబోమన్నారు. ఎక్కువ మొక్కలు నాటే పర్యావరణ ప్రేమికులకు మండల, జిల్లా స్థాయిలో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. మొక్కలు ఎక్కువ నాటే విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలాంటి సందర్భాల్లో అవార్డులిస్తామన్నారు.
అప్పుడు ఎగతాళి చేశారు : ఎకో పార్కు ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని చంద్రబాబు అన్నారు. వనమహోత్సవం ఎంతో మహొత్తరమైన కార్యక్రమమని తెలిపారు. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని, రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెరగాలన్నారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కానీ, భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరమని అన్నారు. పవన్ కల్యాణ్ వద్ద అటవీ, నరేగా శాఖలు ఉన్నాయి. రెండు శాఖల సాయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
బ్రహ్మంగారు నివసించిన రవ్వలకొండను కూడా తవ్వేశారు : అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతోందని, పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. భూతాపం, కాలుష్యం బాగా పెరుగుతున్నాయని, పర్యావరణ పరిరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో నదులు, చెరువులు, కొండలను ధ్వంసం చేశారని, బ్రహ్మంగారు నివసించిన రవ్వలకొండను కూడా తవ్వేశారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు.
జపాన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తాం : మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లో గుట్టలు, రాళ్లు ఉన్న ప్రాంతాల్లోనే మొక్కలు నాటామని గుర్తు చేశారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్‌కు 2014లోనే శ్రీకారం చుట్టామని, డ్రోన్స్‌తో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నగరవనాలు ఏర్పాటు చేస్తామని, జపాన్‌లోని మియావకీ విధానంలో పచ్చదనం పెంచుతామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో నగర వనాలను జపాన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నరేగా నిధుల్ని దీనికి అనుసంధానించి ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
మంగళగిరి ఎకోపార్క్ ఓ సుందర స్వప్నం : తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది కోటి మొక్కలు నాటే లక్ష్యాన్ని రానున్న ఏళ్లలో పెంచుతామని తెలిపారు. ప్రభుత్వపరంగా ఏ పని చేసినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే చేస్తామని స్పష్టం చేశారు. పర్యావరణ ప్రేమికుడైన పవన్ కల్యాణ్ పచ్చదనం పెంచే సంకల్పంతో చేస్తున్న కృషిని ప్రతీ ఒక్కరూ అభినందించాలని అన్నారు. అమరావతి రాజధాని నడిబొడ్డున ఉన్న మంగళగిరి ఎకోపార్క్ ఓ సుందర స్వప్నం అని వ్యాఖ్యానించారు.
మొక్కలు పెంచటం అలవాటుగా మార్చుకోవాలి : పవన్ కల్యాణ్ సంకల్పించిన 50 శాతం పచ్చదనం సాధించటమే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ అని తెలిపారు. అటవీ సంపదను విచ్ఛినం చేయటం వల్ల వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుని కరవు కూడా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. జరుగుతున్న పరిణామాలను విద్యార్థులు గమనించి మొక్కలు పెంచటం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
ముంబై నటి వ్యవహారంలో పోలీసులే దారుణంగా వ్యవహరించారంటే ఇక రక్షణ ఎవరికుంటుందన్న రీతిలో జగన్ పాలన సాగిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడవుల్లో ఎర్రచందనం అభివృద్ధి చేస్తే, వైఎస్సార్సీపీ నరికేందుకు స్మగ్లర్లను తెచ్చిందని విమర్శించారు.
చెట్టుని కూల్చటం తేలిక - పెంచటం కష్టం : ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం అటవీ శాఖ పరంగా చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 29 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50శాతం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని, ప్రతీ ఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లను నరికేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టుని కూల్చటం తేలిక, పెంచటం కష్టమని ప్రతీ ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. ఇవాళ నాటిన ప్రతి మొక్క భావితరాల కోసమేనని అన్నారు. అటవీ వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదని స్పష్టం చేశారు.