CM Chandrababu Naidu Attend Parent Teacher Meeting in Bapatla : ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ - టీచర్ మీటింగ్ సర్కారీ బడుల‌్లోనూ జరగబోతోంది. నేడు ఒకేరోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. బాపట్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిందండ్రులతో ముచ్చటిస్తారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
కలిసి భోజనం చేయనున్న చంద్రబాబు, లోకేశ్ : రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000ల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000లకు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. విద్యార్థులతో ముఖ్యమంత్రి, మంత్రి ముచ్చటించి, వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు వింటారు.
ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు. 1901లో ఏర్పాటైన బాపట్ల పాఠశాల పూర్వవిద్యార్థులనూ ఈ సమావేశానికి ఆహ్వానించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే పేరెంట్ - టీచర్ మీటింగ్‌కి తనను ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్య కమిటీకి లోకేశ్ ధన్యవాదాలు చెప్పారు.
మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు ఈ డిజిటల్ ఇన్విటేషన్లు ఓ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవలసిన చర్యల కోసం ఈ మీటింగ్ దోహదపడుతుందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోడానికి ఈ మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ సరైన వేదికని ఆమె చెప్పారు.
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన : మరోవైపు తల్లిదండ్రుల సమావేశంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివరించనున్నట్లు ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో 'మాదకద్రవ్యాలు వద్దు బ్రో' పోస్టర్లను ఆవిష్కరిస్తారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో రవికృష్ణ పాల్గొ అక్కడే పోస్టర్లను ఆవిష్కరించనున్నారు.
ఇకపై ఇంటర్ విద్యార్థులకు కళాశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనం : లోకేశ్
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh visit to Visakha