Chandrababu on Visakha Development : రాష్ట్ర భవిష్యత్ మార్చేలా కొత్త ప్రణాళికను రెండు, మూడు రోజుల్లో సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఏపీ భవిష్యత్ మార్చేందుకు అవసరమైన కొత్త ప్రణాళికను రానున్న రెండు, మూడు రోజుల్లో ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని చెప్పారు. సమాజంలో అసమానతల తొలగింపు, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యాల పెంపు, రైతు సాధికారత, ఆదాయం పెంపు, తాగునీటి వసతి, ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపు ఆధారంగా ముందుకెళ్దామని చంద్రబాబు వివరించారు.
Chandrababu Visakha Tour : పీపీపీ విధానంలో సంపద సృష్టి జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు పీ4 విధానంతోనూ అవే ఫలితాలు సాధిద్దామని పిలుపునిచ్చారు. టాటా సంస్థ సహకారంతో ఏపీతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్రంగా ప్రత్యేక హబ్‌లు తయారు చేస్తామన్నారు. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్తను తయారుచేసే విధానానికి నాంది పలుకుదామని వివరించారు. ప్రతి డ్వాక్రా సంఘానికి 8 లక్షల సహాయం అందిస్తామని చెప్పారు. డ్రోన్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
అధికారులకు సీఎం నిర్దేశం : టాటా, జీఎంఆర్ సంస్థలను మెంటార్‌గా తీసుకొని హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వివరించారు. అరకు కాఫీ, మిరియాలు, పసుపు పంటలకు మరింత బ్రాండింగ్, మార్కెట్ వృద్ధి సాధించాలని నిర్దేశించారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్రణాళిక, నీతిఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం, తదితర అభివృద్ధి పనుల్లో పీపీపీ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. విజయనగరం, నెలిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ఔటర్‌రింగ్ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
విశాఖ మెట్రోతో పాటు నగర అభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారని భేటీ అనంతరం మంత్రి నారాయణ వెల్లడించారు. వీఎంఆర్డీఏ మొత్తం విస్తీర్ణం 4380 కిలోమీటర్లకు మాస్టర్‌ప్లాన్ గత ప్రభుత్వంలో సిద్ధం చేశారని చెప్పారు. అందులో తప్పులు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. పంచగ్రామాల సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని ఎంపీ శ్రీ భరత్ వివరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్లు ఆయన అన్నారు.
ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు - ఈ దుర్మార్గం అందరూ చూడాలి: సీఎం చంద్రబాబు
ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు