CM Called to Hoist National Flag in Every House : ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రాభివృద్ధికి కోసం వినియోగిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు.
గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగుచేయాలి : ఇప్పటికి 60 రోజుల పాలన పూర్తయ్యిందని ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఇసుక, మద్యంలో గత ప్రభుత్వం దోచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్నా వైఎస్సార్సీపీ నేతలు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఆన్ లైన్ తోపాటు అన్ని సచివాలయాల్లోనూ ఇసుక బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నామన్నారు.
1995లోని పరిపాలనను గుర్తు చేసుకోవాలి : అభివృద్ధి అజెండాగా అధికారాన్ని కొనసాగించుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టుకోవచ్చని సూచించారు. మళ్లీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైఎస్సార్సీపీ.. ప్రస్తుతం 11 సీట్లకు పరిమితం అయ్యిందంటే ఏ విధంగా పరిపాలించారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే 1995 మోడల్ పరిపాలనను గుర్తు చేసుకోవాలని వివరించారు. అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ను దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరని హితవు పలికారు. పార్టీ కోసం కార్యకర్తలు, నేతలు ఎన్నో త్యాగాలు చేశారన్న సీఎం వారందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. మెరిట్ ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో ఇస్తామని తెలిపారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి : జాతీయ జెండా రూపకర్త మన తెలుగువారైన పింగళి వెంకయ్య కావడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం అనంతరం అంచలంచెలుగా దేశాన్ని నాయకులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారని తెలిపారు. దాన్ని కొనసాగించడంతోపాటు మరింత ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఇనుమడించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. అలాగే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ముందడుగు వేశామని వెల్లడించారు. దేశంలోనే మొదటి సారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామన్నారు.
నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు : రాష్ట్రం అన్ని రకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని వాటి పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని తెలిపారు. పార్టీ కోసం త్యాగాలు చేసినవారందరినీ ఆదుకునేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. జనసేన, బీజేపీలతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోందని చంద్రబాబు వెల్లడించారు.