At Home Program Was Held in Raj Bhavan : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో "ఎట్ హోం" కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. రాజ్‌భవన్‌లోని పచ్చిక బయలులో సాయంత్రం ఈ కార్యక్రమం గంట పాటు సాగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనీటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఇతర క్రీడాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు.
గవర్నర్ దంపతులు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిధులను మర్యాదపూర్వకంగా పలకరించారు. తొలుత సీఎం చంద్రబాబుకు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, గవర్నర్ కార్యదర్శి హరి జవహర్‌లాల్ పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. గవర్నర్ వచ్చాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయనకు ఫుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. గవర్నర్ అన్ని టేబుళ్ల దగ్గరకు వెళ్లి అతిథుల్ని ఆప్యాయంగా పలకరించారు. గవర్నర్, చీఫ్ జస్టీస్, సీఎం, డిప్యూటీ సీఎం ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు.
ఎట్ హోంకి వైఎస్సార్సీపీ నేతలు దూరం: మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, యార్లగడ్డ వెంకటరావు, వసంత కృష్ణప్రసాద్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి షర్మిల హాజరు కాగా లోకేశ్, షర్మిల పరస్పరం అభివాదం చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానించడం, రాజకీయాలకు అతీతంగా వారంతా రావటం అనేది ఆనవాయితీగా వస్తోంది. జగన్ దూరంగా ఉండగా, వైఎస్సార్సీపీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధులెరూ హాజరు కాలేదు.