Closing Handloom Textile Exhibition Ceremony : విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. యువతి, యువకులు చేనేత వస్త్రాలను ధరించి చేసిన ర్యాంప్ వాక్ స్థానికులను అలరించింది. భరత నాట్యం, కుచిపూడి, కోలాట ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ ముగింపు కార్యక్రమానికి చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రూ. 2 కోట్లు అమ్మకాలు : ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మంత్రి సవిత, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో చేనేత రంగానికి స్వర్ణ యుగం వచ్చిందన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శన విజయవంతం కావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఆడిటోరియంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించారని తెలిపారు. ఆ రోజు నుంచి 14 రోజుల పాటు అమ్మకాలు ఎవరూ ఊహించనిరితిలో జరిగాయన్నారు. 14 రోజుల పాటు జరిగిన అమ్మకాల్లో రోజుకు రూ.15 నుంచి రూ.20 లక్షల చోప్పున దాదాపు రూ. 2 కోట్లు అమ్మకాలు జరిగాయని వెల్లడించారు.
అలరించిన ర్యాంప్ వాక్ : ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగ ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేళాను ప్రారంభించి ఆయన సతిమతికి చీర కొనుగోలు చేయడంతో ఈ చేనేత వస్త్ర ప్రదర్శనకు విపరీతమైన ప్రచారం లభించిందన్నారు. ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల ఆదరణ పెరగడంతో వస్త్రాల కొనుగోలుకు ఆసక్తి చూపారని మంత్రి వివరించారు. దాళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేతన్నలకి ఆర్ధిక మేలు జరిగేందుకే ఈ వస్త్ర ప్రదర్శన నిర్వహించామన్నారు. అలాగే ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో భరత నాట్యం, కుచిపూడి, ఫ్యాషన్ షో నిర్వహించారు. యువతులు చేనేత చీరలు, యవకులు పంచా, షర్ట్ ధరించి ర్యాంప్ వాక్ చేసి అలరించారు.
నూతన టెక్స్‌టైల్ పాలసీ : త్వరలో నూతన టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీని తీసుకురానున్నట్టు చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. ప్రధానంగా టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మౌలిక వసతుల కల్పనతోపాటు రాయితీలనూ విరివిగా అందిస్తామని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 2018-23 పాలసీని మరింత మెరుగులు దిద్ది నూతన పాలసీని తీసుకువస్తామన్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడిదారులతో నిన్న(సోమవారం) మంత్రి సచివాలయంనుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.