Clashes in municipal council meetings in AP: రాష్ట్రంలో అధికారం మారడంతో తిరుపతి నగరపాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తమ వాణిని మార్చారు. గత మూడేళ్ల పాలనలో తాము ఆమోదం తెలిపిన పనులనే తప్పుపడుతూ విజిలెన్స్ విచారణ చేయలని పట్టుపట్టారు. నగరంలో నిర్మించిన మాస్టర్‌ప్లాన్ రహదారులు, టీడీఆర్ (TDR) బాండ్లపై విచారణకు పట్టుబట్టారు. మరోవైపు విజయవాడ, కదిరి కౌన్సిల్ సమావేశాలు సైతం రసాభాసగా మారాయి.
Tirupathi District : రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా మారాయి. తిరుపతి ఎస్వీయూ (SVU) సెనెట్ హాల్‌లో మేయర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. గడచిన మూడేళ్ల కాలంలో డిప్యూటీ మేయర్‌గా అభినయరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎమ్మెల్యే(MLA) హోదాలో భూమన కరుణాకరరెడ్డి కనుసన్నల్లో సాగిన సమావేశాల్లో అజెండా అంశాలపై చర్చ కూడా లేకుండా ఏకగ్రీవ తీర్మాలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దానికి భిన్నంగా తమ గళాన్ని వినిపించారు. గత సమావేశాల్లో తాము ఆమోదించిన తీర్మానాలతో సాగిన అభివృద్ధి పనులపై విచారణకు డిమాండ్ చేశారు.
డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, పదో డివిజన్ కార్పొరేటర్ ప్రతాపరెడ్డి గత మూడేళ్లలో జరిగిన ఘటనలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్, రహదారులు, టీడీఆర్ బ్లాండ్లపై విచారణ జరిపించాలని ప్రతాపరెడ్డి కోరారు.
రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు - బీపీసీఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు
Vijayawada : విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తాగునీటి సమస్యపై తీవ్ర చర్చ జరిగింది. కృష్ణా నది పక్కనే ఉన్నా నగరవాసులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదని సీపీఎం కార్పొరేటర్ సత్తిబాబు, తెలుగుదేశం సభ్యులు ధ్వజమెత్తారు. పాతకాలం పైపులు, బోర్లు బాగు చేయడం లేదని ఆరోపించారు. తాగునీటి పైపులు మురుగు కాల్వలో కలిసిపోయి ఇటీవల డయేరియా ప్రబలి ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు. కార్మికులు, ప్లంబర్స్ కొరత ఉందన్న మేయర్ భాగ్యలక్ష్మీ అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని అధికారులను ఆదేశించారు.
టీడీపీలోకి మరో ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు
Satyasai District : శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కొంతమంది సభ్యులు, ఉద్యోగులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం సభ్యులు ముస్తఫా, ఫయాజ్, వైఎస్సార్సీపీ సభ్యుడు కృపాకర్ రెడ్డి ఆరోపించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు అమ్ముకోవడం, వాహనాలకు డిజిల్‌లో పెద్దఎత్తున సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. సమావేశ అజెండాను తూతుమంత్రంగా తయారు చేశారని, దీనిని రద్దు చేసి కొత్తగా తయారు చేయాలని కొంతమంది సభ్యులు పట్టుబట్టారు. దీనికి మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సమావేశం అర్థంతరంగా ముగిసింది.
Palamaneru Municipal Council meeting : పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్లు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. దోమల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.