Baby Selling Incidents in Ongole : శిశువులు మరీ ముఖ్యంగా ఆడపిల్లలే ఆమెకు అంగడి సరకులు. తాను డబ్బు సంపాదించేందుకు పేద మహిళలపై ఆశల వల విసురుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కలియతిరుగుతుంది. నవజాత శిశువులపై కన్నేస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే తల్లిదండ్రులను గుర్తిస్తుంది. అనంతరం వారితో మాటలు కలుపుతుంది. ఆపై వారికి నచ్చజెప్పి కన్న పేగును ఇతరులకు అమ్మేయిస్తుంది. నెల రోజుల వ్యవధిలోనే ఒంగోలులో ఇటువంటి దందాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు దీనిపై సీరియస్‌గా దృష్టిసారించారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుసుకున్నారు.
చెల్లింపుల్లో తేడాతో వెలుగులోకి : చీమకుర్తి మండలానికి చెందిన ఓ మహిళ ఇటీవల ఐదో కాన్పులోనూ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు వచ్చారు. ఆ సమయంలో పాప తల్లితో పొదిలికి చెందిన ఓ మహిళ పరిచయం ఏర్పరుచుకుని మాటలు కలిపింది. అలా సదరు బిడ్డను బాపట్ల జిల్లా కర్లపాలేనికి చెందిన దంపతులకు విక్రయించింది. నగదు చెల్లింపు విషయంలో తేడా రావడంతో పోలీసులను శిశువు తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పొదిలికి చెందిన ఓ మహిళ ఈ తరహా దందా సాగిస్తున్నట్లు తెలుసుకున్నారు.
ప్రభుత్వ వైద్యశాలలే అడ్డాలు : పొదిలికి చెందిన ఓ మహిళ శిశు విక్రయ దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచూ సంచరిస్తూ పేద మహిళలను ఎంచుకుంటుంది. గర్భిణులు, నవజాత శిశువులకు చెందిన తల్లిదండ్రుల వివరాలు ఇతరుల నుంచి తెలుసుకుంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంతానం ఉంటే వారిపై ఆశల వల విసిరి ప్రలోభాలకు గురి చేస్తుంది. సుమారు నెల రోజుల క్రితం పొన్నలూరుకు చెందిన ఓ మహిళకు చెందిన శిశువును ఇదే తరహాలో విక్రయించింది.
ప్రస్తుతం చీమకుర్తి మండలానికి చెందిన ఓ చిన్నారిని అమ్మేసింది. సదరు వ్యక్తులకే గతంలోనూ ఒక ఆడపిల్లను విక్రయించింది. అయితే సదరు నవజాత శిశువుకు హృద్రోగ సమస్య ఉండటంతో ఆ దంపతులు తిరిగి ఆ చిన్నారిని వెనక్కి ఇచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న పొదిలికి చెందిన మహిళ గత కొంత కాలంగా ఇదే తరహాలో శిశు విక్రయ దందాను నిర్వహిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై మరింత లోతుగా విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తి స్థాయలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.