CHANDRABABU PRAJA GALAM MEETING: ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని, జగన్ దోపిడిదారు, బంధిపోటు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. రఘురామకృష్ణరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనను హింసించారని తెలిపారు.
రామరాజు సేవలు రాష్ట్రానికి అవసరమని, అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడిదారి, సైకో అని ధ్వజమెత్తారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చానన్న చంద్రబాబు, మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు.
భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని, మద్యంతో వేలాది కోట్ల రూపాయలు దోచేసాడని ఆరోపించారు. మీ భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యాడని, ఫ్యానుకు ఉరేయాలని, వైఎస్సార్సీపీని తరిమేయాలని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని తెలిపారు.
ఇవి న్యాయానికి, అన్యాయానికి జరిగే ఎన్నికలు అని పేర్కొన్నారు. మద్యపానం రద్దు చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారని, జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. పోలవరం పూర్తి చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగభృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్లు ఇంకా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక టిడ్కో ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు.
పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తుల ఫొటోలు కాదని, రాజముద్ర వేయిస్తాన్నారు. మీ భూమి మీదిగా ఉండాలంటే కూటమికి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి చట్టాలకు సంబంధించిన పత్రాలు తగలబెట్టాలని తెలిపారు. తాను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు.
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING