CANCER SCREENING PROGRAM IN AP: క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో ఇప్పటివరకు 1.14 శాతం అనుమానిత కేసులు బయటపడ్డాయి. గత నెల 14వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.27 లక్షల మందిని పరీక్షించగా, వారిలో 34 వేల 653 (1.14 శాతం) మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఏపీలో 18 ఏళ్లు దాటిన వారు 4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 2 కోట్ల మంది మహిళలు. 18 ఏళ్లు దాటిన యువతులకు రొమ్ముక్యాన్సర్ స్వీయపరీక్షపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. చివరి విడత పరీక్షల్లో పీహెచ్‌సీ వైద్యులు క్యాన్సర్ కేసులను గుర్తిస్తారు. ఏపీలో ఏటా 73 వేల కొత్త క్యాన్సర్ కేసులు, 40 వేల వరకు మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్నే కావడం గమనార్హం.
విజృంభిస్తున్న 'మహమ్మారి' - మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - జాగ్రత్త పడండి
కేసుల గుర్తింపుపై ఫోకస్: జీవనశైలి వ్యాధుల సర్వే-3 కింద ప్రతి ఇంటికీ ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓలు వెళ్లి వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ప్రశ్నల ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, టీబీ, కుష్ఠు, ఇతర వ్యాధుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ దశలో క్యాన్సర్ లక్షణాలు కలిగినవారిని ఇంటివద్దే పరీక్షిస్తున్నారు. అత్యధికంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్లు అధికంగా ఉంటున్నాయి. ఈ కేసులు ఆందోళన కలిగిస్తున్నందున 18 ఏళ్లు దాటిన మహిళల్లో సర్వైకల్, ఓరల్, బ్రెస్ట్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. టార్చిలైట్ వేసి నోటి లోపల భాగాన్ని పరిశీలిస్తున్నారు. ఇదే విధంగా పురుషులకూ చేస్తున్నారు. అదే విధంగా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షను పీహెచ్‌సీల్లో చేస్తున్నారు. రొమ్ము చర్మం రంగు మారిందా?, కణితులు ఉన్నాయా?, రొమ్ముల పరిమాణంలో ఏవైనా తేడాలున్నాయా? లేవా అనే వాటిని పరిశీలిస్తున్నారు.
15 వేల టీమ్‌ల ద్వారా సర్వే: ఏపీలో ఇప్పటివరకు 2 సార్లు జీవనశైలి వ్యాధులపై సర్వే చేశారు. ఈసారి ఇందులో క్యాన్సర్ పరీక్షలను చేర్చారు. వైద్యులకు విశాఖలోని హోమీభాభా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చారు. వీరి దగ్గర ట్రైనింగ్ పొందినవారు మిగిలినవారికి శిక్షణ ఇచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 15 వేల టీమ్‌ల పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్నాయి.
అలర్ట్ : పురుషుల్లో వృషణాల క్యాన్సర్ ముప్పు - ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? - Testicular Cancer Symptoms
పరీక్షల తరువాత కేసుల నిర్ధారణ: క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించినవారికి పీహెచ్‌సీలలో నిర్ధారణ చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అవసరమైనవారిని మళ్లీ బోధనాసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నారని, ప్రివెన్షన్ ఆంకాలజీ యూనిట్లు ఏర్పాటుచేశామన్నారు. పీహెచ్‌సీ వైద్యులు బోధనాసుపత్రులకు రిఫర్ చేసేముందు హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి, సి పరీక్షలు సైతం చేస్తారని వెల్లడించారు. బయాప్సీ టెస్టులూ జరుగుతాయని, ఈ సర్వే రాష్ట్రంలో 10 నెలలు కొనసాగుతుందని తెలిపారు. వ్యాధుల భారాన్ని తగ్గించేందుకు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు ఇది బాగా ఉపయోగపడుతుందని కృష్ణబాబు వెల్లడించారు.