Buggana Vs Kotla: నంద్యాల జిల్లా డోన్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. హ్యాట్రిక్ విజయం కోసం వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, తెలుగుదేశం తరఫున సత్తా చాటేందుకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఉవ్విళ్లురుతున్నారు. ప్రచారంలోనూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇద్దరు బలమైన నాయకులు కావటంతో డోన్‌లో రాజకీయం ఆసక్తిరేపుతోంది.
మూడోసారీ నెగ్గి హ్యాట్రిక్ సాధించాలని డోన్ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆ పరంపరను కొనసాగించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అనూహ్యంగా టికెట్ పొందిన బుగ్గన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2019లోనూ రెండోసారి గెలుపొంది జగన్ కేబినేట్‌లో ఆర్థికమంత్రిగానూ సేవలందించారు. మూడోసారీ నెగ్గి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. బుగ్గనను ఓడించాలంటే బలమైన వ్యక్తి కావాలని భావించిన తెలుగుదేశం పార్టీ డోన్‌తో అనుబంధం ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అభ్యర్థిగా నిలబెట్టడంతో రాజకీయం వేడెక్కింది.
2004లో కోట్ల సుజాతమ్మ విజయం: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి 1994లో గెలుపొందారు. సూర్యప్రకాష్‌రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ 2004లో ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. తమ కుటుంబానికి డోన్ నుంచి విడదీయరాని బంధం ఉందని, ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని సూర్యప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో చేరిన బుగ్గనకు కుడిభుజం: నియోజకవర్గంలో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రణాళికలు రచిస్తూ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బుగ్గనకు కుడిభుజంగా ఉన్న బేతంచర్ల ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, డోన్ మార్కెట్ యార్డు ఛైర్మన్ రాజా నారాయణ మూర్తి ఇటీవల పసుపు కండువా కప్పుకున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నారాయణమూర్తికి ప్యాపిలి, డోన్ మండలాల్లో గట్టి పట్టు ఉంది.
వైసీపీని వీడి తెలుగుదేశంలోకి: డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కోట్రికే హరికిషన్ సైతం కోట్ల సమక్షంలో సైకిల్ ఎక్కారు. ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన కేడీసీసీ డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్ పెదనాన్న వెంకటేశ్వర్లు సైతం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గత రెండు ఎన్నికల్లో బుగ్గన గెలుపునకు కృషి చేసిన కీలక నేతలు, ప్రస్తుతం వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరడం బుగ్గనకు ఎదురుదెబ్బెనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని, తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.