Bhaskar Buildings Victims Protest: కాకినాడ కలెక్టరేట్ వద్ద భాస్కర్ బిల్డింగ్స్ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి తమ గోడును విన్నవించుకునేందుకు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బంధువు ఆధ్వర్యంలో నిర్మించిన అపార్ట్మెంట్ నాణ్యతా లోపంతో కుంగిపోవటంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల నుంచి అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం: కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న భాస్కర్ బిల్డింగ్స్ సెప్టెంబర్9, 2019న నాణ్యతా లోపంతో కుంగిపోయింది. వెంటనే 40 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో రోడ్డున పడ్డామని బాధితులు చెబుతున్నారు. తామంతా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, అప్పులు తెచ్చిమరీ కొనుగోలు చేసిన బిల్డింగ్స్ కూలిపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలను కలిసి తమ గోడు వినిపించినా న్యాయం జరగలేదని తెలిపారు.
వైఎస్సార్సీపీ అండతో రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా - లోకేశ్‌కు బాధితుడి మొర - nara lokesh prajadarbar
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ దండలతో నాసిరకం నిర్మాణం చేసి 40 మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్స్ ద్వారంపూడి బంధు వర్గానికి చెందినవారు కావటంతో వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపముఖ్యమంత్రి పవన్‌ను కలిసేందుకు వచ్చామంటున్నారు. అయితే తమ సమస్య విన్నవించుకోకుండా సిబ్బంది అడ్డుకోవడంతో ఆందోళనకు దిగామని తెలిపారు.
"భాస్కర్ ఎస్టేట్స్ ప్లాట్లలో మా 40 కుటుంబాలు నివాసం ఉండేవి. నాణ్యతా లోపంతో ఈ భవనాలను నిర్మించడంతో పిల్లర్స్ కుంగిపోయాయి. దీంతో ఇక్కడ ఉంటే ప్రమాదం అని అధికారులు మమ్మల్ని ఖాళీ చేయించారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మేము అద్దెలు కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. గత ఐదేళ్ల నుంచి మాకు న్యాయం జరగాలని ఏ అధికారి వద్దకు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు."
- భాస్కర్ బిల్డింగ్స్ బాధితులు
'నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ'- పోలవరంలో నిపుణుల పరిశీలన - Polavaram Project