Ramachandra Yadav Write Letter To CM Chandrababu Naidu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సొంత డెయిరీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)కు లేఖ రాశారు.
BCY Chief Promises To Donate 1000 Cows To TTD : "రోజుకు సగటున సుమారు లక్ష మంది భక్తులు శ్రీవారి దర్శించుకుంటారు. రోజుకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేం? ప్రభుత్వం దీనికి సిద్ధం అయితే నా తరఫున వేయి గోవులను ఇస్తాను. మరో లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. ఈ లక్ష గోవులతో రోజుకు కనీసం పది లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయొచ్చు. వాటి నుంచి రోజుకు 50 వేల కేజీల వెన్న తీసి, 30 వేల కేజీల నెయ్యి తయారు చేయవచ్చు. ఈ నెయ్యిలో స్వామి వారి అవసరాలకు సగం వాడగా, మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించవచ్చు. అదే విధంగా కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చు" అని రామచంద్ర యాదవ్ వివరించారు.
టీటీడీ పాలక మండలిలో వారు ఉండాలి : "తిరుమల ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది రాజకీయ పునరావాస కేంద్రమో, వ్యాపార ఆస్థానమో, కార్పొరేట్ లాబీయింగుల ఆవాసమో కారాదు. మీరు ఏర్పాటు చేయబోయే టీటీడీ పాలక మండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాలవారు వ్యక్తులు కాకుండా ఛైర్మన్ సహా సభ్యులు అంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడగలరని మనవి. గత ఐదు సంవత్సరాల అరాచకాలతో అపవిత్రమైన ఏడు కొండల వాడి సన్నిధిని పరిరక్షించుకుని, పవిత్రత కాపాడడానికి ఇంత కంటే మంచి మార్గం ఉండదు" అని లేఖలో ఆయన పేర్కొన్నారు.