Bandi Sanjay oath as Union Minister : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దిల్లీ రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో, కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు మాట్లాడిన బండి సంజయ్, తనకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికలయ్యాక అభివృద్ధే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు. విమర్శలకు ప్రతివిమర్శలకు తావు లేకుండా అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గానికి మునుపటికంటే అధికంగా నిధులు తెస్తానన్న ఆయన, రాష్ట్రాభివృద్ధి కోసం కూడా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Bandi Sanjay Political Career : బండి సంజయ్ 1971లో కరీంనగర్లో జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్‌గా పని చేశారు. ఎల్.కె. అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Bandi Sanjay Political Journey : కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం అయ్యారు.
Bandi Sanjay as a Central Minister : 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి సహా ఈయనకూ కేంద్రమంత్రి పదవి దక్కింది.
ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం - Union Ministers From AP