Bakrid Celebrations Were Held Grandly Across the State: రాష్ట్రంలో బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని మత పెద్దలు సందేశం ఇచ్చారు. ప్రతిఒక్కరూ స్థోమతను బట్టి దాన ధర్మాలు చేయాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి వారితో కలిసి ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌తో పాటు తెలుగుదేశం నేతలు జలీల్ ఖాన్, రఫీ, మౌలానా ముస్తాక్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారుఖ్ షిబ్లీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ముస్లింలకు బక్రీద్ శూభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్థనల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. తుళ్లూరు ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ముస్లింలతో కలిసి రాజధాని రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతిలో మళ్లీ పనులు మొదలు కావడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, నెల్లూరు బారాషాహీద్ దర్గాలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి బక్రీద్ ప్రార్థనలకు హాజరయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం దర్గాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రార్థనలు చేశారు.
రాయలసీమ జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల, ఆదోని, రాయదుర్గం, అనంతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం, కడప, మైదుకూరు సహా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. మంత్రి ఫరూక్ సహా ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని త్యాగానికి ప్రతీక బక్రీద్ అని కొనియాడారు. మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమలాపురం, జంగారెడ్డిగూడెంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ నిర్వహించారు. ఈద్గాల్లో ప్రార్థనల తర్వాత ముస్లింలు దువా చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.