APCC State Executive Meeting Conducted in Vijayawada : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై క్షేత్ర స్థాయిలో గళమెత్తాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ సహా ఖర్గే లను ఆహ్వానించాలని నిర్ణయించారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల సహా సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ను బలోపేతం చేసే విషయమై మాణికం ఠాగూర్ కార్యాచరణ అజెండా రూపొందించారు. ప్రజల్లోకి వెళ్లి చేపట్టబోయే కార్యక్రమాల అజెండా తయారైందని, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు పూర్తైందని, ఇదే తరహాలో జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పోరాటం చేస్తామన్నారు.
రాబోయే ఆరు నెలల్లో : సమావేశం అనంతంరం సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో ఒక మంచి ఎజెండాను అందరితో చర్చించటం జరిగిందన్నారు. రాబోయే ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎలా బలోపేతం చేయాలో సమావేశంలో చర్చించామని తెలిపారు. అందుకు సంబంధించిన ఎజెండాను పార్టీ నేతలతో కలిసి రూపొందించామని వెల్లడించారు. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం నూతనంగా ఎంపికైనా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గంలో యువకులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
దేశం బాగుపడాలంటే : అందరూ చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వివరించారు. త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఇదివరకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం లేనందున కేవలం పైస్థాయిలోనే కార్యక్రమాలు జరిగియని తెలిపారు. ప్రస్తుతం కార్యవర్గం ఏర్పటైనందున కింది స్థాయివరకూ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్తామని రఘువీరారెడ్డి తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలి: వైఎస్ షర్మిల - Sharmila Fires on YS JAGAN And CBN