AP Leaders on TTD Administrative Building Fire Accident : రాష్ట్రంలో ఫైల్స్ తగులబెడుతున్న దొంగలెవరూ తప్పించుకునే అవకాశమే లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు అడ్డంగా దోచుకుని రోజుకో ప్రాంతంలో ఫైళ్లు తగులబెడితే బయటపడతామనుకోవడం అవివేకమే అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చోటుచేసుకోగా, తాజాగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఫైల్స్ తగులబెడుతున్న దొంగలెవరూ తప్పించుకునే అవకాశమే లేదని భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లు అడ్డంగా దోచుకుని రోజుకో ప్రాంతంలో ఫైళ్లు తగులబెడితే బయటపడతామనుకోవడం అవివేకమే అన్నారు. ఘటనకు కారణమైన కుట్రదారులు, సూత్రధారులు, లబ్దిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకంపై భద్రపరిచిన ఫైల్స్‌కు పటిష్ట రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
MLA Arani Srinivasulu Comments: టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆరోపించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనను ఆయన పరిశీలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటన మరువకముందే, టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు తాఖీదులు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఉన్నారని, పోలీసు దర్యాప్తులో నిజానిజాలు వెలువడుతాయని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
Chinta Mohan Comments: టీటీడీలో 6 నెలల క్రితం రూ.100 కోట్లు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయన్నారు. సత్రాల కోసం రూ.1200 కోట్లకు ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, భక్తుల హుండీ సొమ్మును అపవిత్రం చేశారన్నారు. హుండీ సొమ్మును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని, తిరుపతిలో అగ్నిప్రమాదం ఘటనపై అనుమానాలున్నాయన్నారు. వరుస ఘటనలపై టీటీడీ ఈవో విచారణ చేయాలని చింతామోహన్ కోరారు.