Negligence on Karatam Krishna Murthy Reservoir: 35 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 1970లో ఏలూరు జిల్లా కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీని ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని 22గ్రామాల పరిధిలో పంటలు సాగవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది.
2019లో వరదల కారణంగా ప్రాజెక్టు ప్రధాన కాలువ కుడివైపున గండిపడి అప్పట్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఇది జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ గండిని పూడ్చేందుకు అధికారులు ముందుకు రాలేదు. ఇప్పటికీ ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు కింద సాగుచేసుకునే రైతులతో పాటు లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గండిపడిన ప్రాంతం నుంచి ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని భయాందోళనలో బతుకుతున్నారు. గండి పూడ్చాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు.
నీరు లేక కళ్లముందే ఎండిపోతున్న పంటలు - బరువెక్కిన గుండెతో ఆత్మహత్యే శరణం అంటూ రోడ్డెక్కిన రైతన్నలు
ప్రాజెక్టు నిర్వహణ లేకపోవడంతో గట్టుపై చెట్లు పెరిగి అభయారణ్యాన్ని తలపిస్తున్నాయి. గట్టు చాలా చోట్ల బలహీనపడడంతో ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడింది. ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని తరలించే కుడి, ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గేట్లు మూసినా అవి పాడవడంతో వాటి నుంచి నీరు లీకవుతూనే ఉంది. కాలువల రివెట్మెంట్ పాడై పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తే గట్లకు నెర్రెలిచ్చి గండి పడే ప్రమాదం కనిపిస్తోంది.
మరోవైపు గట్లపై చెట్లను తొలగించకపోవడంతో అవి విద్యుత్ తీగలకు తగులుతూ తరచూ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. వచ్చేది వర్షాకాలం కావడంతో ఇకనైనా అధికారులు ప్రాజెక్టు నిర్వహణపై దృష్టి సారించి పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రధాన కాలువకు పడిన గండిని త్వరితగతిన పూడ్చాలని, మరమ్మతులన్నీ ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా గోరుకల్లు జలాశయం - మట్టికట్ట కుంగడంతో ఆందోళనలో ప్రజలు
"కొన్ని వేల ఎకరాలకు నీరు వెళ్తూ ఉంటుంది. ఆరు సంవత్సరాల క్రితం కుడి కాలువ గట్టు తెగిపోయింది. అప్పటి నుంచి దానిని పట్టింటుకున్న దాఖలాలు లేవు. దీని నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ప్రస్తుతం ఇది చెట్లతో అడవిని తలపిస్తోంది. కాలువలకు ఏర్పాటు చేసిన గేట్లు తుప్పుపట్టి పాడైపోవడంతో నీరు వృథాగా పోతోంది". - సత్యనారాయణ, చక్రదేవరపల్లి సర్పంచ్
"ఈ ప్రాజెక్టు నిర్వహణకు సరైన నిధుల లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు నుంచి మట్టి కూడా భారీగా తరలిపోయింది. గట్లు చుట్టూ చెట్లు భారీగా పెరిగిపోయాయి". - ప్రసాద్, జంగారెడ్డిగూడెం
శ్రీశైలం నీళ్లు అమ్మకం - బడా వాణిజ్య రైతులతో అధికారుల కుమ్మక్కు !