AP Government Issued Guidelines for Employees Transfers : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగష్టు 19 తేదీ నుంచి 31 తేదీ వరకూ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం తాత్కాలికం గా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 తేదీ నుంచి 15 వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Govt Approves Transfers of Employees : రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులుకు బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వారికి మాత్రం బదిలీల వర్తించవు : గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీల వర్తింపజేశారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు , వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్యభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేశారు. ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయించారు. తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించారు. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. పరిశీలన తర్వాత కూడా పరిపాలన పరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియక పోయినా ఆఫీస్ బేరర్లను బదిలీలు చేయొచ్చని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.