ACB Inquiry on Venkata Reddy : గనుల శాఖలో అక్రమాల పుట్టగా మారిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. గనులు, ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయణ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో ఆయన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ గురువారం మెమో జారీ చేశారు. ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు.
EX Mines Director Venkata Reddy Suspend : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సిలికా శాండ్, క్వార్ట్జ్ దోచుకోవడం వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో ఆయనపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సమాచారం. ఏపీఎండీసీలో బొగ్గు, మంగంపేటలో ముగ్గురాయి, నెల్లూరులో బీచ్‌శాండ్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర నివేదిక సిద్ధమయ్యాక వేర్వేరు కేసులు పెట్టొచ్చని తెలుస్తోంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో చేరారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్‌గా, కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల నుంచి తొలగించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Mines Venkata Reddy Irregularities : జులై 31న వెంకటరెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై ఏపీ సర్కార్ బుధవారమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అనేక రీచ్లలో అక్రమాలు, ఉల్లంఘనలు నిజమేనని గనుల శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను అఫిడవిట్‌కు జత చేసింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి మాతృశాఖ అయిన దిల్లీలోని కోస్ట్‌గార్డ్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్‌కు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ లేఖ రాశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయణ్ని సస్పెండ్ చేసినట్లు అందులో వెల్లడించారు.
ఇంతకీ వెంకటరెడ్డి ఎక్కడ? : వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల కాపీని ఆయనికి అందజేయాల్సిందిగా గనుల శాఖ సంచాలకుడికి సూచించగా, అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీఎండీసీ అతిథిగృహంలో మూడున్నరేళ్ల పాటు కుటుంబంతో వెంకటరెడ్డి నివాసం ఉన్నారు. జులైలో దాన్ని ఖాళీచేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్ నంబర్ మార్చేశారని తెలిసింది.
ఏపీఎండీసీకి చెందిన అటెండర్ రాజు వెంకటరెడ్డి ఇంట్లో మూడున్నరేళ్లు పనిచేశారు. ఆయన ఇల్లు ఖాళీ చేసినప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేసింది రాజేనని ఏపీఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగా ఏ శాఖలోనూ, ఎవరినీ బదిలీ చేయొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా రాజును వెంకటరెడ్డి జూన్ 6న అన్నమయ్య జిల్లా మంగంపేట ముగ్గురాయి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. మరునాడే సర్కార్ ఆయణ్ని అన్ని పదవుల్లోంచి తొలగించింది.
వెంకటరెడ్డి లీలలు అన్నీఇన్నీ కావు : తొలుత ఏపీఎండీసీ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా 2021లో వెంకటరెడ్డి ఇసుక విధానం రూపొందించారు. ప్రైవేట్ సంస్థలు ఏయే నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్నారు. కానీ ఆయన వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. జేపీ సంస్థ ఇసుక టెండర్లు దక్కించుకుంది. దానితో ప్రభుత్వం తరపున గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వెంకటరెడ్డి ఒప్పందం చేసుకున్నారు.
గనుల శాఖకు చెందిన వే బిల్లులే జారీ చేయాలన్న గత నిబంధనను పక్కనపెట్టారు. గుత్తేదారు ముద్రించుకున్న వే బిల్లులను చేతిరాతతో ఇచ్చేలా వెంకటరెడ్డి అవకాశమిచ్చారు. దీంతో జేపీ సంస్థ తప్పుడు లెక్కలు చూపించి అడ్డగోలుగా దోచేసింది. ఒప్పందం ప్రకారం ప్రతినెలా 1, 16 తేదీల్లో టెండర్లో పేర్కొన్న మొత్తాన్ని గుత్తేదారు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ జేపీ సంస్థ నెలల తరబడి సొమ్ము జమ చేయలేదు. మొత్తంగా రూ.850 కోట్లు చెల్లించాల్సి ఉన్నా బకాయిలేమీ లేవంటూ వెంకటరెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చారు.
కాంట్రాక్టు గడువు 6 నెలలు పొడిగింపు : జేపీ సంస్థ కాంట్రాక్టు గడువు-2023 మేతో ముగిసింది. కానీ మరో 6 నెలలు నవంబర్ వరకు కొనసాగేలా వెంకటరెడ్డి అవకాశమిచ్చారు. ఇందుకూ ప్రభుత్వ అనుమతులు, ఆదేశాలు తీసుకోలేదు. గతేడాది డిసెంబర్ నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందిన సంస్థలతో జరిగిన ఒప్పందాల్లోనూ వాళ్లకు అనుచిత లబ్ధి కలిగేలా ఆయన వ్యవహరించారు. ఈ సంస్థలు కూడా 15 రోజులకోసారి సొమ్ము చెల్లించకుండా రూ.230 కోట్లు బకాయిపడ్డాయి. అయినా వాటిపై చర్యలు తీసుకోలేదు.
ఎన్జీటీ, సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం : సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునళ్లకు వెంకటరెడ్డి తప్పుడు సమాచారమిచ్చారు. 2023 మార్చిలో ఏపీలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దుచేస్తూ ఎన్జీటీ ఆదేశాలిచ్చినప్పటికీ, గుత్తేదారులు యథావిధిగా తవ్వకాలు కొనసాగించారు. ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ వెంకటరెడ్డి ఎన్జీటీ, సర్వోన్నత న్యాయస్థానానికి గతంలో ఇచ్చిన అఫిడవిట్లో తెలిపారు. అదే సమయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జీటీ, సుప్రీంకోర్టు ముందు ఆధారాలు ఉంచింది. కోర్టులకు వెంకటరెడ్డి తప్పుడు సమాచారమిచ్చారని నిర్ధారించారు.