AP CID SIT officers Role in Documents burning incident: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్‌గ్రిడ్, ఎసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, చంద్రబాబు, లోకేశ్, ఇతర నేతలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు సిట్ ఎదుర్కొంటోంది. అలాంటి సిట్ సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా కేసులకు సంబంధించిన పలు పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయం ఉన్న ‘‘సంవృద్ధి నెక్సా ’’ అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ పత్రాలను తగలబెట్టేశారు.
సిట్ అధిపతి, ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి వద్ద పనిచేసే సిబ్బంది ఓ సంచీ నిండా పత్రాలు తీసుకొచ్చి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఓ మూలన కుప్పగా పోశారు. ఆ తర్వాత దానికి నిప్పు అంటించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వివరాలు, ఈ కేసులో హెరిటేజ్ సంస్థ, సిట్ అదనపు ఎస్పీకి రాసిన సమాధానాల ప్రతులు, హెరిటేజ్ లోగోతో ఉన్న ఇతర పత్రాలు సహా, మరికొన్ని దస్త్రాలనూ కాల్చేశారు. ఈ మొత్తం దృశ్యాలను సిట్ సిబ్బందే చిత్రీకరించారు. పత్రాలు తగలబెడుతుండటాన్ని గమనించిన స్థానికులు కొందరు.. అవి ఏం పత్రాలు? ఎందుకు కాలుస్తున్నారు అని ప్రశ్నించగా ‘ఇవి చంద్రబాబుకు సంబంధించిన దస్త్రాలు ’ అంటూ ఆ సిబ్బంది సమాధానమిచ్చారు. పత్రాలను కాల్చేసి ఆ వీడియోలు పంపించాలని తమ పెద్దసారు చెప్పారని.. అందుకే వీడియోలు తీస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు కొందరు వారి సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా.. వాటిని తీయవద్దంటూ సిట్ సిబ్బంది బెదిరించారు. సెల్‌ఫోన్ల నుంచి ఆ దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి చేశారు. పత్రాల దహనం అంశం మీడియాలో ప్రసారం కావడంతో అక్కడ కాల్చిన కాగితాల ఆనవాళ్లు కనబడకుండా చేసేందుకు ప్రయత్నించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు చేసింది. వైసీపీకి కొమ్ముకాసే అధికారిగా విమర్శలున్న ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డిని దీనికి అధిపతిగా నియమించింది. ఆ తర్వాత దీన్ని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2గా మార్చింది. సిట్ ఏర్పాటైనప్పటి నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులే లక్ష్యంగా ఇది పనిచేసింది. నిరాధార, నిర్హేతుకమైన అంశాలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు నారా లోకేశ్, నారాయణలపై సిట్‌లో కేసులు నమోదు చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సిట్ అధికారులు నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబీకుల్ని నిందితులుగా చేర్చారు. గతేడాది అక్టోబరు 10, 11 తేదీల్లో నారా లోకేశ్‌ను, ఆ తర్వాత తెలుగుదేశం నాయకుడు కిలారు రాజేశ్‌ను ఈ సిట్ కార్యాలయానికే పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. నారా భువనేశ్వరికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ పత్రాలను, లోకేశ్ ముందు పెట్టి వాటిపైనా ప్రశ్నించారు. ‘ఈ పత్రాలు మీకు ఎలా వచ్చాయి’ అంటూ దర్యాప్తు అధికారిని తాను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేక దాటవేశారని అప్పట్లో లోకేశ్ మీడియాకు వెల్లడించారు.
సిట్ కేసులకు సంబంధించిన పత్రాల దహనం ఘటనపై వివరణతో సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అయిదు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామని, అంతకంటే ముందే ఆయా కేసుల డైరీలు, ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి సమర్పించామని రఘురామిరెడ్డి తెలిపారు. అభియోగపత్రాలతో పాటు సమర్పించిన ఆధారాలన్నీ నిందితులకు కోర్టు ద్వారా అందించాల్సి ఉంటుందని, ఒక్కో అభియోగపత్రంతో పాటు 8 -10 వేల పత్రాలున్నాయని వెల్లడించారు. ఒక్కో కేసులో 12 నుంచి 40 మంది వరకూ నిందితులున్నారన్న ఆయన, వాళ్లందరికీ ఈ పత్రాలు ఇవ్వటం కోసం లక్షల పేజీలు జిరాక్స్‌లు తీయిస్తున్నామని ప్రకటలో పేర్కొన్నారు.
సిట్ కార్యాలయంలో దర్యాప్తు పత్రాల కాల్చివేత - ఈసీకి టీడీపీ ఫిర్యాదు - TDP on Set Fire to Documents
దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను, దర్యాప్తు అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పలు మీడియా సంస్థలు బాధ్యతారహితంగా కథనాలు ప్రసారం చేశాయని ఆరోపించారు. అలాంటి అనైతిక చర్యలకు మీడియా దూరంగా ఉండాలని హితోక్తులు చెప్పిన ఆయన, నేరాన్ని రుజువు చేసేందుకు తగిన సహేతుక ఆధారాల్ని కోర్టు ముందు పెట్టినట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆధారాలను సృష్టించారని, హెరిటేజ్ సంస్థకు, వ్యక్తులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లకు సంబంధించిన పత్రాలను చట్టవిరుద్ధంగా పొందారని అందుకే వాటిని ధ్వంసం చేశారని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని వివరణలో పేర్కొన్నారు. ఇది దర్యాప్తు బృందాన్ని బెదిరించడమేనని తెలిపారు. ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారమే నిందితుడు, ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను అధికారికంగా తీసుకున్నామని, ఇతర ఆధారాల్లాగానే ఈ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను చట్టబద్ధంగానే పొందామని తెలిపారు.
మరో 34 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులకు సంబంధించిన ముఖ్య పత్రాలను తగలబెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగుకు సంబంధించిన ఆధారాలను, హార్డ్‌డిస్క్‌లను అక్కడి పోలీసు అధికారులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ధ్వంసం చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలు, వాంగ్మూలాలు వంటి వాటిని ధ్వంసం చేశారా అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.
ఎంతో నమ్మకంతో ఇస్తే దహనం చేస్తారా ? - పత్రాల భద్రతపై హెరిటేజ్ ఆందోళన - HERITAGE DOCUMENTS BURNING