Anna canteens Reopens: 2019 వరకు పేదోళ్ల పొట్ట నింపిన అన్న క్యాంటీన్లకు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ మహర్దశ వస్తోంది. గత వైఎస్సార్సీపీ సర్కార్ కక్షపూరితంగా మూసివేయగా వాటిని పునఃప్రాంభించేందుకు కొత్త ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది. ఆగస్టు 15 నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవతీసుకుని దాతల సహకారంతో ఉచితంగా భోజనాలు పెడుతూ అన్నార్తులను ఆదుకుంటున్నారు.
పేదలు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, చిరువ్యాపారుల కోసం 2014-19 మధ్యలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రాంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గరి అన్నాన్ని లాక్కున్నట్లు వీటిని మూసివేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం వస్తోంది. ఒంగోలులో కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవతీసుకుని దాతల సహకారంతో నగరంలోని నాలుగు అన్న క్యాంటీన్ల వద్ద దాదాపు మూడు వారాల నుంచి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు.
నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా పెడుతూ ఆకలి తీరుస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అనేకమంది స్వచ్ఛంద సేవకులు, వ్యాపార వేత్తలు రోజుకు ఒకరు చొప్పున ఈ నాలుగు క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. వీటిద్వారా రోజుకు సుమారు రెండువేల మందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
"ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలు మేరకు ప్రతి రోజూ ఉచితంగా భోజనాలు పెడుతున్నాం. నగరంలోని నాలుగు అన్న క్యాంటీన్ల వద్ద దాదాపు మూడు వారాల నుంచి ఉచితంగా భోజనాలు అందిస్తున్నాం. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రాంభించేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది." - అబ్బూరి వెంకటరావు, నిర్వాహకులు
"పేదోడి పొట్ట నింపేందుకు 2014లో టీడీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన అన్న క్యాంటీన్లను 2019లో జగన్ సర్కార్ మూసివేసింది. పేదవాడి నోటి దగ్గరి అన్నాన్ని గత ప్రభుత్వం లాగేసింది. ఇప్పుడు కూటమి రావటంతో అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం వస్తోంది." - స్థానికులు
తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదలకు పండగే: బొండా ఉమా - Bonda Uma about Anna Canteen