World Bank on Irrigation Projects in AP : సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. కేంద్ర పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి. ఆ పథకాల కింద నిధులు సాధిస్తే ప్రభుత్వ వాటా 30 శాతం భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంటు రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభించింది.
AP Govt Seeks Funds World Bank to Irrigation Projects : ప్రపంచబ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండ్రోజుల కిందట సమావేశమైంది. ఆ తర్వాత జలవనరులశాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు. ఏయే రూపాల్లో ప్రపంచబ్యాంకు, రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశం ఉందో ఒక ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సమస్యలు లేని ప్రాజెక్టులకు నిధులపై బృందం సముఖత? : ఎలాంటి సమస్యలూ లేకుండా నిధులు అందిస్తే, త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆయకట్టుకు నీరందించగలిగే ప్రాజెక్టుల విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఆసక్తి చూపింది. ప్రధానంగా భూసేకరణ, అటవీ భూమి సేకరణ, పునరావాసం వంటి సమస్యలు లేకుండా తక్షణమే పూర్తి చేయగల ప్రాజెక్టులు ఏమేం ఉన్నాయో, వాటికి నిధులు అందించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నట్లు తెలిసింది.
దీంతో జలవనరులశాఖ అధికారులు చింతలపూడి ఎత్తిపోతల, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ నిర్మాణం పూర్తి అయింది. కొన్ని పనులు పూర్తిచేస్తే ఆ మొదటి టన్నెల్ ద్వారా జలాశయంలో నీరు నింపి కొంత ఆయకట్టుకు సరఫరా చేసే ఆస్కారం ఉంది. ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పనులు ఎప్పుడో 85 శాతం పూర్తయ్యాయి. చివరి వరకు నీటిని తీసుకువెళ్లేందుకు కాలువ వెడల్పు పనులకు గతంలోనే టెండర్లు పిలిచారు. తొలిదశలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయాల్సి ఉంది. చింతలపూడి ఎత్తిపోతల విషయంలో చిన్న అవాంతరాలు మినహా, పనులు చేసుకునేందుకు ఏమీ ఇబ్బందులు లేవు. గాలేరు నగరి పనులకూ నిధులు అవసరం.
AP Govt Focus On Irrigation Projects : వీటికి సంబంధించి ప్రపంచబ్యాంకు బృందం పూర్తిస్థాయి నివేదికలు తీసుకుంది. స్వయంగా ఆయా ప్రాజెక్టులను పరిశీలించనుంది. గోదావరి కరకట్టల మరమ్మతులు, ఇతర పనులకు రూ.500 కోట్లు కావాల్సి ఉంది. ఆ నిధులూ ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం ఉంది. ఈ పథకంలో కేంద్రం 70 శాతం నిధులు భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30 శాతం భరించేందుకు ఇన్నాళ్లూ జగన్ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సరిగా ఉపయోగించుకోలేదు. డ్రిప్‌లో ఇప్పటికే రూ.667 కోట్లు మంజూరయ్యాయి. 31 ప్రాజెక్టులను ఇందులో గుర్తించారు.
రూ.500 కోట్లతో సిద్ధమైన కార్యాచరణ : రైవాడ జలాశయం, శ్రీశైలం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు తొలిదశలో నిధులు మంజూరయ్యాయి. వాటిని వేగంగా వినియోగించుకుంటే మరిన్ని నిధులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని, ప్రపంచ బ్యాంకు బృందం పేర్కొంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద రూ.500 కోట్లతో కార్యాచరణ సిద్ధమయింది.