Andhra Pradesh Govt Looking to Divert APMDC Funds: రాష్ట్ర విభజన సమయంలో స్తంభించిపోయిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన 700 కోట్ల రూపాయల నిధులపై జగన్ ప్రభుత్వం కన్నేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు వాటిని ఎలాగైనా తీసుకురావాలని వైసీపీ సర్కారు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసింది. ఇవి కొలిక్కి రావడంతో ఈ వారంలోనే ఆ సొమ్ము APMDCకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అసలే నిధుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖజానాలో వేసి ఇతర అవసరాలకు వినియోగించడం, లేదా ఇతర మార్గాల్లో వాడుకునేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలో APMDC (Andhra Pradesh Mineral Development Corporation Ltd) ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వేరుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. విభజన సమయంలో బ్యాంకు ఖాతాలో దాదాపు 1,200 కోట్ల రూపాయల మేర నిధులు ఉండగా, వాటిని పంచుకోవడంలో వివాదం ఏర్పడింది. అందులో ఏపీఎండీసీకి 58 శాతం, టీఎస్ఎండీసీకి 42 శాతం నిధులు పంపిణీ జరగాల్సి ఉంది. అప్పట్లో ఈ పంపిణీ కొలిక్కి రాకపోవడంతో బ్యాంక్ ఖాతాలో నిధులు ఫ్రీజ్ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల కోసం ప్రయత్నాలు చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చివరకు ఆ నిధులను పంచుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
పంచాయతీలకు శాపంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు - నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచులు
ఈ నిధుల్లో ఏపీఎండీసీకి 700 కోట్లు, టీఎస్ఎండీసీకి 500 కోట్ల రూపాయల వరకు దక్కనున్నాయి. దీనిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆడిటర్ల ద్వారా రికార్డుల పరిశీలన పూర్తయ్యాక వారంలోనే నిధుల పంపిణీ జరగనుంది. అయితే ఆ నిధులు నేరుగా ఏపీఎండీసీ ఖాతాలో చేరుతాయా? ప్రభుత్వ ఖజానాకు జమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ నిధులు వెళితే, మళ్లీ ఏపీఎండీసీకి వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే ఉండదనే వాదన వినిపిస్తోంది. అదే ఏపీఎండీసీ ఖాతాలోకి వస్తే మరో విధంగా అయినా వైసీపీ ప్రభుత్వం తీసుకునేందుకు చూస్తున్నట్లు సమాచారం.
కొంత కాలం కిందట రాష్ట్రప్రభుత్వం ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నిధులు అందులో జమచేసేలా ఒత్తిళ్లు తెచ్చారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించుకుంది. ఇందులో భాగంగా ఏపీఎండీసీ కొంతకాలం కిందట మంగంపేట ముగ్గురాయి విక్రయాల ద్వారా వచ్చిన 150 కోట్ల రూపాయలను ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో జమచేసింది. ఆ సొమ్ము ఇప్పట్లో ఏపీఎండీసీ.కి వచ్చే అవకాశంలేదని తెలుస్తోంది.
ఎన్ని సార్లు చెప్పిన మారని వైఖరి - మరోసారి నిధులను పక్కదారి పట్టించిన జగన్ సర్కార్