Anantapur Youth Shines in Agriculture: చదువు పూర్తైన తరువాత ఏదో ఒక కొలువులో చేరాలని ప్రయత్నిస్తారు యువత. కానీ మీరు ఈ యువకులు అందుకు పూర్తిగా భిన్నం. ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పనిచేయడం కంటే పుట్టిన ఊరిలోనే తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వచ్చిన సంపాదనతో తృప్తిగా బతుకుతున్నారు. వ్యవసాయంలో వస్తున్న నూతన ఒరవడులను రైతులకు వివరిస్తూ సాగులో రాణిస్తున్నారు ఈ యువ రైతులు.
అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లికి చెందిన ఈ యువతకు చిన్నప్పటి నుంచి కన్న ఊరుపై అమితమైన ప్రేమ. పుట్టిన ఊరిలోనే జీవనం సాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నది వీరి లక్ష్యం. అందుకే వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని ఐటీ ఉద్యోగుల కంటే మిన్నగా ఆర్జిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో రైతులు ఆచరిస్తున్న మెరుగైన సాగు విధానాన్ని, నాణ్యమైన దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకున్నారు.
వెంకటాంపల్లి గ్రామంలో సుమారు 630 కుటుంబాలున్నాయి. ఇందులో దాదాపు 350 మంది యువకులు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇంటర్ వరకు మాత్రమే చదువుకోగా, తక్కువ మంది ఉన్నత విద్య పట్టభద్రులున్నారు. అయితేనేం మొబైల్ ఫోన్సే వీరికి గురువులు. ఇంటర్నెట్ను వినియోగించుకుంటూ క్రమ క్రమంగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
సాగుపై ఉన్న మక్కువతో ఉన్నత చదువులకు కూడా వెళ్లకుండా వ్యవసాయాన్నే నమ్ముకున్నారు ఈ యువ రైతులు. వీరు పండించిన పండ్ల ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి అంటే వారి నాణ్యతను, కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కరువు కాటకాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని నూతన పద్ధతులతో సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ కాలంలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుంటూ సాగు చేస్తున్నారు.
తాడిపత్రి జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న వెంకటాంపల్లిలో రైతులంతా ఎక్కువగా ఉద్యాన పంటలే సాగుచేస్తున్నారు. గ్రామంలో యువ రైతులు ఎక్కువ భాగం విస్తీర్ణంలో అరటి సాగుచేస్తుండగా, కొందరు దానిమ్మతో పాటు చామంతి, రోజా పూలసాగు చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ లాభాల బాట పడుతున్నారు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి సాగు చేస్తున్నారు.
ఉద్యోగం చేయాలంటే ఊరికి దూరమవ్వాలి అని భావించిన ఈ యువకులు సొంత ఊరిలోనే వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి నూతన పద్ధతులలో పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వ్యవసాయం చేస్తూనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నిరూపించారు.