Anantapur District Court Revealed Sensational Judgement On Murder Case : అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో ఓ ప్రైవేటు టీచర్ హత్య కేసులో నిందితుడికి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో నేరం చేయాలనుకునే వారికి కోర్టు గట్టి సందేశాన్ని ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా కంబదూరు మండలం కదిరి దేవరపల్లి గ్రామానికి చెందిన హరిజన, రుద్రేశ్ దంపతులు ఎంఏ బీఈడీ చదివి కళ్యాణదుర్గంలో ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో రుద్రేశ్ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వివాహిత విజయలక్ష్మీతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. విజయలక్ష్మి ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పని చేసేది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో రుద్రేశ్ కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. చివరకు రుద్రేశ్తో అతని భార్య విడిపోయే పరిస్థితి వచ్చింది.
పథకం ప్రకారమే చంపేశాడు : మరోవైపు విజయలక్ష్మి సైతం రుద్రేశ్ను బెదిరించేది. తన భార్యని వదిలి రాకపోతే అతను పంపిన వాట్సప్ మెసేజ్లు, ఫొటోలు పోలీసులకు చూపించి కేసు పెడతానని బెదిరింపులకు దిగేది. దీంతో రుద్రేశ్ రోజూ మానసిక సంఘర్షణకులోనై ఎలాగైనా విజయలక్ష్మిని తుదిముట్టించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2018 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన విజయలక్ష్మీని ఉదిరిపికొండ-శివరాంపేట గ్రామాల మధ్యలో ఉన్న ఒక గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమెపై బండరాయితో మోదీ హత్య చేశాడు.
ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే
కఠిన యావజ్జీవ కారాగార శిక్ష : ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలును తీసుకుని అదేరోజు కళ్యాణదుర్గంలోని ఓ ఫైనాన్స్ దుకాణంలో తాకట్టుపెట్టి లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు. రెండు రోజుల తరువాత హత్య ఉదాంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అత్యంత చాకచక్యంగా ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు నిందితుడు రుద్రేశ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై అనంతపురం జిల్లా కోర్టులో విచారణ జరిగింది. కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి హత్య చేసినట్లు కోర్టులో నిరూపించారు. దీంతో జిల్లా జడ్జి ఐపీసీ సెక్షన్ 302 క్రింద కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే 25 వేల రూపాయల జరిమానాను విధించారు.
"నా కుమార్తె టీచర్ ట్రైనింగ్ చేస్తూ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. ఈ క్రమంలోనే నిందితుడు రుద్రేశ్తో ఎలా పరిచయం అయిందో తెలియదు. మా అమ్మాయిని నమ్మించి బయటకు తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం నా కుమార్తె ఒంటిపై ఉన్న బంగారు నగలును తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు పెట్టాం. ఇప్పుడు కోర్టు ద్వారా మాకు న్యాయం జరిగింది. సంతోషంగా ఉంది." - సరస్వతి, మృతురాలి తల్లి
వాలంటీర్ హత్య కేసు - వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ అరెస్ట్