Amaravati Drone Summit 2024: డ్రోన్ల సాంకేతికత ఓ గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, మొబైల్ ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, యాప్స్, శాటిలైట్ డేటాను క్రోడీకరించి విలువైన సమాచారాన్ని క్రోడీకరించవచ్చని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపదగా మారనుందని అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు వివరించారు.
CM Start Drone Summit: అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీకె కన్వెన్షన్‌లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్‌లో 6929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 53 స్టాల్స్‌లో డ్రోన్ల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది.
Drone Corporation 2 MOUs: అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఒప్పందం చేసుకుంది. తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్ట్నర్గా చేర్చుకుంటూ రెండో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీని "డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా"గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం: డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి
CBN Brand Ambassador For Drone Market: డ్రోన్ మార్కెట్ విస్తరణకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తానే ఈ రంగాన్ని ప్రోత్సహించకుంటే ఇంకెవరూ ప్రోత్సహించలేరన్నారు. ఎక్కువ నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. యువత, డ్రోన్ తయారీ పరిశ్రమలు, కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ అద్భుతాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనల దిశగా విద్యార్థులను మలచాలని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేశారు. సర్వీస్ ప్రొవైడర్‌కు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్ కానుందని వెల్లడించారు.
Drone Hub At Orvakal: ఇప్పుడు యుద్దాల్లో కూడా వాడే డ్రోన్లను అభివృద్ధి కోసం వినియోగించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. 20వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని వివరించారు. అమరావతిని దేశానికి డ్రోన్ నగరంగానూ, ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్ హబ్‌గా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. అందరి ఆలోచనలతో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తామన్నారు. కర్నూల్ సమీపంలోని ఓర్వకల్లు వద్ద 300 ఎకరాల భూమిని డ్రోన్ హబ్ కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ఇది కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
భవితకు దిక్సూచిలా 'అమరావతి డ్రోన్ సమ్మిట్' - నిపుణుల హర్షం
Drone Use In Policing: డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని తెలిపారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్ల కదలికలు ట్రాఫిక్ సమస్యలు ఇలా పోలీస్ శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా డేటానే ఎంతో కీలకమని, డేటాని ఏఐకి అనుసాధించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని వెల్లడించారు.
విజయవాడ వరదల్లో దాదావు లక్షన్నర మందికి డ్రోన్ల సాయంతో ఆహారం అందివ్వటం ఓ వినూత్న ప్రయోగమని వ్యాఖ్యానించారు. డ్రోన్ సాయంతో రియల్ టైమ్‌లో 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించి ఎత్తివేయించామని గుర్తు చేశారు. రేపటి తరానికి డ్రోన్లు గేమ్ చేంజర్లని స్పష్టం చేశారు. వైద్యం, వ్యవసాయం, రహదారుల నిర్మాణం ఇలా వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం కీలకం కానుందని పేర్కొన్నారు. ఈ వినూత్న ఆలోచనలకు లాజికల్ పరిష్కారం చూపాల్సిన బాధ్యత డ్రోన్ తయారీదారులుపై ఉందని తెలిపారు.
Chandrababu About 1995 memories: సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అనలటిక్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవటంలో ఏపీ ముందుంటుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయం పొందేవారిలో భారతీయులదే అగ్రస్థానం, వీరిలో 30శాతం మంది తెలుగు వారు ఉండటం గర్వకారణమన్నారు.
1995లో ఐటీ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలతో హైటెక్ సిటీ రూపకల్పన చేశామని వెల్లడించారు. నాడు హైటెక్ సిటీని ప్రభుత్వ ధనంతో కాకుండా, పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించామని గుర్తు చేశారు. ఎక్కువ మంది ఇంగ్లీషు మాట్లాడే వాళ్లు, గణిత నిపుణులు మన దేశానికి ఉన్న వనరులని బిలగేట్స్కి వివరించి ఉమ్మడి ఏపీలో ఐటీ విస్తరణకు అడుగులు వేశామన్నారు. టెలికాం రంగంలోనూ వినూత్న ఆలోచనలను కేంద్రానికి వివరించామని తెలిపారు. హరిత విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా విమానయాన రంగంలో పోటీ పెంచి అందుబాటు ధరల్లో విమాన ప్రయాణం ఉండేలా సరికొత్త ప్రయోగాలు రెండున్నర దశాబ్దాల క్రితమే సృష్టించామన్నారు.
డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా 'అమరావతి'! - దేశంలోనే మొదటిసారిగా 5,500 డ్రోన్లతో షో
Ram Mohan Naidu in Drone Summit: ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే డ్రోన్ హబ్ గా మారాలని ఆకాంక్షిస్తున్నా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. డ్రోన్ల సమర్ధ వినియోగం ద్వారా అత్యవసర సేవలు అందించటం సరికొత్త విప్లవమని తెలిపారు. గత 10ఏళ్లలో కేంద్ర పౌర విమానయాన రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. 74 విమానాశ్రయాలను 157కి గత పదేళ్లలో పెంచామని, రానున్న రోజుల్లో 200పై చిలుకు విమానాశ్రయాల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 132 డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాల ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని వెల్లడించారు. కొత్త తరం, కొత్త ఆలోచనలు, కొత్త రకం డ్రోన్ల లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రస్తుతం 27 వేల డ్రోన్లు రిజిస్టరై ఉండగా, లక్ష డ్రోన్ల రిజిస్ట్రేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అత్యుత్తమ డ్రోన్ పాలసీని అమలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ముందుందన్నారు. దిల్లీ కేంద్రంగా జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ కారణంగానే అమరావతి కేంద్రంగా జరుగుతోందని తెలిపారు. ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. 1995 లోనే 2020 లక్ష్యాలను నిర్ధేశించి భవిష్యత్ ప్రణాళికలు రచించిన దార్శనికుడు చంద్రబాబు అని తెలిపారు.
మోదీ-బాబు జోడీ దేశ ప్రగతికి ఎంతో కీలకం: చంద్రబాబు పరిపాలన ఆలోచనలు ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా ఉంటాయన్నారు. యువత ను చంద్రబాబు ఎంతలా ప్రోత్సహిస్తారో తానే ఓ ఉదాహరణ అన్నారు. రాష్ట్రానికి లభించిన కేంద్ర క్యాబినెట్ పదవి 36 ఏళ్ల అతి చిన్న వయస్సు ఎంపీ అయిన తనకు ఇచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించని నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. గడచిన 10 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించటంలో మోదీ కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని మోదీ-బాబు జోడీ దేశ ప్రగతికి ఎంతో కీలకమని వెల్లడించారు.
Central Civil Aviation Secretary in Drone Summit: గతంతో పోల్చితే డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉంలున్ మాన్గ్ ఉలనం తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డ్రోన్ల తయారీ, వినియోగానికి కేంద్రం ఎంతో తోడ్పాటునిస్తోందన్నారు. డ్రోన్ రంగంలో అంకురాలు, యువతను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. డ్రోన్ల సమర్ధ వినియోగానికి సలహాలు, సూచనలు కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP CS on Speed of Doing Business: ఈజ్ ఆఫ్ లివింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వం నినాదమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ స్పష్టంచేశారు. పెరుగుతున్న డ్రోన్ల వినియోగాన్ని వివిధ రంగాల్లో అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి వేగంగా అభివృద్ధి చెందే ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు.
డ్రోన్ల ద్వారా మందుల సరఫరా - పైలట్ ప్రాజెక్టు విజయవంతం - Medicines Delivering with Drones
మరోవైపు మంగళవారం సాయంత్రం బెరంపార్క్‌లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించనున్నారు. 5500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో చేయనున్నారు. వీటిని తిలకించేందుకు విజయవాడలో ఐదు ప్రదేశాలలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనిత అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.