Alliance Candidates Election Campaign in AP : ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు దూకుడు పెంచారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని తెలుపుతున్నారు. ఏపీ బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావలని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు.
మంచివారు పార్టీలో ఉండలేరంటూ వైసీపీని వీడుతున్న శ్రేణులు-టీడీపీలోకి జోరుగా చేరికలు
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య తీర్చటమే లక్ష్యం పని చేస్తానని హామీ ఇచ్చారు. నందిగామ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ శివారు అనాసాగరం ఒకటో వార్డులో ఆమె పర్యటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులతో కూటమి అభ్యర్థి సృజనా చౌదరి అల్పాహార సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం : శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో కొత్తూరు, మరదరాజపురం, జగన్నాథపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థి గౌతు శిరీషా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీలో కూటమి అభ్యర్థి కూన రవికుమార్ ప్రచారం చేపట్టారు. విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్ధి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో 'మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ ' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్ద తీనార్లలో కూటమి ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనితకు పార్టీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమంలో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పాల్గొన్నారు.
ఇంటింటికి సూపర్ సిక్స్ : ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్నమెట్టలో కూటమి నాయకులు, కార్యకర్తలతో విజయ్ కుమార్ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. అలాగే చిత్తూరు నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్ధి గురజాల జగన్మోహన్ ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతపురం అర్బన్‌లో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. రజక వృత్తిదారులతో కలిసి చొక్కాలు ఇస్త్రీ చేశారు. రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి వద్ద దోశలు వేసి టీడీపీకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
వైసీపీని దించడానికి అందరూ సిద్ధం : అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగించిన అరాచక పాలనకు ఇక చివరి రోజులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుండటంతో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. అలాగే యువత, రైతులు, చేనేత కార్మికులు, ముస్లింలు ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
వ్యాపారస్తులకి పూర్వ వైభవం : విజయవాడలో పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్తక, వ్యాపార, వాణిజ్య రంగంగా పేరుగాంచిన విజయవాడ నగరంలో వ్యాపారస్తులకి తెలుగుదేశం,బీజేపీ, జనసేన కూటని అండగా నిలుస్తుందని తెలిపారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకి పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరువ్యాపారాలకు ప్రవేశపెట్టిన అనేక పథకాలను పశ్చిమ నియోజకవర్గం వ్యాపారులకు చేరువయ్యాలా చేస్తామన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
లెక్కలేనన్ని హామీలిచ్చారు - ఐదేళ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
ఆ అధికారులు అంతా చింతించే రోజు తప్పకుండా వస్తుంది: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ