All parties Election Campaign in Andhra Pradesh : ఎన్నికల ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో కూటమి అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
ప్రచారాల్లో దూసుకెళ్తున్న కూటమి నేతలు - హారతులు, గజమాలలతో మహిళల స్వాగతం
కూటమి తోనే మహిళా సాధికారత సాధ్యం : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి బ్రాహ్మణపల్లి తండాలో ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆమెకు దండలు వేసి, హారతులిచ్చి స్వాగతం పలికారు. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి యువకులు సింధూరారెడ్డికి ఏకరవు పెట్టారు. కూటమి అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో సూళ్లూరుపేట కూటమి అభ్యర్థి విజయశ్రీ ప్రచారం చేశారు. మహిళలు హారతులిచ్చి, పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కూటమి అధికారంలోకి వస్తేనే మహిళా సాధికారత సాధ్యమని అన్నమయ్య జిల్లా మదనపల్లె కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు షాజహాన్‌బాషాకు మద్దతుగా మదనపల్లెలో ముస్లింలు సమావేశం నిర్వహించారు.
పూలు జల్లి, టపాసులు కాల్చుతూ బ్రహ్మరథం : నంద్యాల జిల్లా డోన్ కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ప్యాపిలి మండలంలో ప్రచారం చేశారు. గ్రామస్థులు ఆయనపై పూలు చల్లుతూ, టపాసులు కాల్చి బ్రహ్మరథం పట్టారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరని కోట్ల విమర్శించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటేసి గెలిపిస్తే గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఫుల్ జోష్‌లో కూటమి అభ్యర్థులు - ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తు ప్రచారం
లోకేశ్‌కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబం ప్రచారం : గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్‌కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మూడోరోజు ప్రచారం నిర్వహించారు. నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్, ఇతర కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరిగారు. రాష్ట్రప్రజల బంగారు భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నాలక్ష్మీనారాయణ కంటేపూడి, నందిగామ గ్రామాల్లో ప్రచారం చేశారు. కన్నా రోడ్‌షోలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రాక్షస పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపు : విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా ఆయన సతీమణి అనురాధ ప్రచారం చేశారు. ముస్లిం మహిళలతో కలిసి 19వ డివిజన్‌లో ఇంటింటికీ తిరిగారు. కరపత్రాలు పంచుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు, కూటమి మేనిఫెస్టోను వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గద్దె రామ్మోహన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కృష్ణా జిల్లా గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి ప్రచారం చేశారు. వారి రోడ్‌షోకు మహిళలు, స్థానికులు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం, జనసేన జెండాలు చేతపట్టి వీధుల్లో తిరిగారు. గుడివాడలో 20ఏళ్లుగా సాగుతున్న రాక్షస పాలనను ప్రజలు అంతం చేయాలని వెనిగండ్ల రాము ఓటర్లను కోరారు.
కూటమి నేతలకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ : విజయనగరం జిల్లా రాజాంలో కూటమి అభ్యర్థి కొండ్రు మురళి సతీమణి శ్రీలక్ష్మి ప్రచారం చేశారు. మహిళలు శ్రీలక్ష్మికి హారతులిచ్చి ఆప్యాయంగా పలకరించారు. నమూనా ఈవీఎంతో ఓటర్లకు శ్రీలక్ష్మి అవగాహన కల్పించారు. శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు గార మండలంలో ప్రచారం చేశారు. కూటమి రోడ్‌షోకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామస్థులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తర్వాత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
హోరెత్తిన ప్రచారాలు- అస్త్రశస్త్రాలతో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు