Acharya Nagarjuna University VC Rajasekhar Resigns : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పట్టిన రాజకీయ చెద వదిలింది. ఉపకులపతి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ రాజశేఖర్ ఉపకులపతి పదవికి రాజీనామా చేయడంతో అధ్యాపకులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
వైఎస్సార్సీపీ భజన : ఐదు సంవత్సరాలు వైఎస్సార్సీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టుపట్టించారో అదే స్థాయిలో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిష్టను అంతే దిగజార్చారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఈయన బాధ్యతలు చేపట్టిన తరువాత చదువులమ్మ తల్లికి రాజకీయ చెద పట్టుకుంది. నాగార్జునుడి పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయానికి అపఖ్యాతే మిగిలింది. వీసీ పదవి పొందడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఆయన వైఎస్సార్సీపీ భజన వేశారు.
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ రాజీనామా - AU VC and Registrar Resigned
ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పరీక్షలు వాయిదా : విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడం, మూడు రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహణ, వైఎస్సార్సీపీ ప్లీనరీకి పార్కింగ్ స్థలాన్ని ఏఎన్‌యూలో కేటాయించడం, ప్లీనరీ సందర్భంగా పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై విద్యార్థులు కులపతి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ : 2022 సెప్టెంబరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెగ్యులర్ వీసీగా రాజశేఖర్ నియమించారు. అంతకు ముందు సుమారు మూడు సంవత్సరాల పాటు ఇన్చార్జి వీసీగా కొనసాగారు. నాలుగన్నరేళ్లు ఇన్చార్జిగా, రెగ్యులర్ వీసీగా కొనసాగడం వెనక వైఎస్సార్సీపీ పెద్దల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. గతంలో ఆయన వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేసినప్పుడు అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు చక్రపాణి కమిటీ నివేదిక నిర్దారించింది. కమిటీ నివేదిక తప్పులు తడకగా ఉందని కోర్టుకు వెళ్లి మరీ ఆయన వీసీ పదవిని తెచ్చుకున్నారు.
వర్సిటీలో ఆందోళనలు : రాజశేఖర్ వీసీ పదవికి అనర్హుడని ప్రొఫెసర్ రత్నశీలామణి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అది కోర్టు వరిధిలోనే ఉంది. ఒకప్పుడు ప్రొఫెసర్ సింహాద్రి, లక్ష్మణ్ వంటి ఎందరో విద్యావేత్తలు ఉపకులపతులుగా పని చేసి వర్సిటీకి మంచి పేరు తీసుకొచ్చారు. రాజశేఖర్‌ను మాత్రం సాగనంపాలంటూ గత కొద్ది రోజులుగా వర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. మొత్తంగా వారి ఆందోళనలు ఫలించాయి. అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.