EX Mines MD Venkata Reddy Irregularities : జగన్ సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ఏసీబీ అనుమతి తీసుకుంది.
ACB Investigation on Mines Venkata Reddy : గత సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి సర్కార్ పెద్దల ఆదేశాలకనుగుణంగా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఆయణ్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ముందస్తు అనుమతి తీసుకున్న ఏసీబీ : ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద సీఎస్ నుంచి అనుమతి పొందారు. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీజీ వెంకటరెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున పదవీ విరమణ చేయడం సాధ్యం కాదు.
గనుల లీజుల కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో ఆయన పలు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి రూ.800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఆయన ఎన్‌వోసీ ఎలా జారీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలను సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల ఉల్లంఘనల్లోనూ ప్రమేయం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది.
ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ : ఇప్పటికే ఏసీబీ పలు కీలక ఆధారాలను సేకరించింది. మరోవైపు వెంకటరెడ్డి గత రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు. సస్పెన్షన్ నోటీసులు అందజేయడానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ క్రమంలో అతని కదలికలపై కూడా ఏసీబీ గురి పెట్టింది.