Wife Killed Husband In Bhadradri Kothagudem : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారి తీసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా కట్టుకున్న భర్తనే హత్య చేయించింది ఓ భార్య. మానవత్వాన్ని మంటగలిపే ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ చేస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మన్ తెలిపిన వివరాల ప్రకారం, కొత్తగూడెం పట్టణంలోని గౌతంపూర్ కాలనీకి చెందిన అరికె రమేశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన సాహు ఈశ్వర్ కుమార్ (38) భార్యతో అతడికి వివాహేతర సంబంధం ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ విషయం ఈశ్వర్ కుమార్‌కు తెలిసింది.
సింగరేణి క్వార్టర్లో అక్రమంగా నివాసముంటున్న రమేశ్‌ను అక్కడి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్ కుమార్. ఆ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులతో కలిసి ఈ విషయంపై సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారులు రమేశ్ కుటుంబాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
బయట కాపలా కాసి భర్తను హత్య చేయించి : తన భార్య వివాహేతర సంబంధాన్ని సహించలేని ఈశ్వర్ కుమార్ ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో తన భర్త అడ్డువస్తున్నాడని ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు రమేశ్‌కు చెప్పడంతో పాటు, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రెచ్చగొట్టింది. అతడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. వారి ప్లాన్‌లో భాగంగా ఈ నెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈశ్వర్ కుమార్‌పై రమేశ్, అతడి అల్లుడు బట్టు చందు, భార్య ఇందిర కత్తులతో దాడి చేశారు.
పాత కక్షలతో : భర్త జాడ గురించి నిందితులకు ఉప్పందించిన అతడి భార్య, దాడి సమయంలో ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాసింది. గతంలో ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే శత్రు కుటుంబం ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైన బాధితుడు ఈశ్వర్ కుమార్‌ను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈశ్వర్ రావు మృతి చెందారు.
విచారణలో విస్తుపోయే విషయాలు : ఈ ఘటనపై టూ టౌన్ సీఐ రమేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో హతుడి భార్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. అమెను విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను బుధవారం రోజున పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు.