Yanamala Fires on Jagan : అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్‌తోపాటు సాక్షి పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.
కోర్టుకు వెళ్లడం జగన్ డ్రామాలో భాగం : ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం దారుణమని యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయ పునరావాసం కోసమే ఆయన దిల్లీ వెళ్లారని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి పారిపోవడావనికే, సాధ్యం కాని ప్రతిపక్షహోదాను అడుగుతున్నారని విమర్శించారు. శాసససభ వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదని తెలిసి కూడా కోర్టుకు వెళ్లడం జగన్ డ్రామాలో భాగమేనని యనమల దుయ్యబట్టారు.
Yanamala Criticism of YSRCP : ప్రజలకు, చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని తన చేష్టలతో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే, ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే షరతు కూడా ఆయన పెడతారేమోనని వ్యంగాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేసి స్థానిక సంస్థలు లేదా ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, మండలిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలం ఆధారంగా ప్రతిపక్ష నేత హోదా సాధించుకోవచ్చని హితవు పలికారు.
'శ్వేత పత్రాల్లోని అంశాలపై తాము ప్రతిపక్షంలో ఉండగానే చెప్తూ వచ్చాం. మా ఆరోపణలపై ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎందుకు మీడియా సమావేశాలు పెట్టలేదు. జగన్ అప్పుల గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారు. శ్వేతపత్రంలో అప్పులు అవాస్తమంటున్న జగన్, తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా' అని యనమల సవాల్ విసిరారు.
"గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆదాయం వచ్చిందనేది వాస్తవం. అయినా రూ.10 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఆ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలి. ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వృద్ధి సాధించారంటే జగన్ వద్ద సమాధానం లేదు." - యనమల రామకృష్ణుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు
తెలుగుదేశం ప్రభుత్వానికి తెలిసిన విద్య : జగన్ చెబుతున్నట్లు బ్రహ్మాండమైన పాలన అందించి ఉంటే, ప్రజలు ఇంత ఘోరంగా తీర్పు ఇచ్చి ఉండేవారు కాదని ఆయని గ్రహించాలని యనమల అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని జగన్ అంటుంటే, తప్పు చేశారు కాబట్టే పక్కన పెట్టామని ప్రజలు అంటున్నారని తెలిపారు. అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచి, దానిని ప్రజలకు పంచడం తెలుగుదేశం ప్రభుత్వానికి తెలిసిన విద్య అని బుగ్గన గ్రహించాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు: యనమల రామకృష్ణుడు - Yanamala Rama Krishnudu comments