Violation of Rules for CM YS Jagan Siddham Meeting: సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్, నేడు రెండో బహిరంగ సభను ఏలూరు జిల్లా మల్కాపురం వద్ద నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన 50 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మంది వైసీపీ కార్యకర్తలను ఈ సిద్ధం సభకు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన స్థలంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
కాలువ గట్లను సైతం యంత్రాలతో తవ్వేసి: సభా వేదిక వద్దకు జనం చేరుకునేందుకు అధికారులు ఏకంగా ఓ పంట కాలువను పూర్తిగా పూడ్చేశారు. పంట వ్యర్థాలను కొల్లేరుకు తీసుకెళ్లే మురుగు కాల్వను మూడుచోట్ల మట్టితో కప్పెట్టేశారు. ఇప్పటికే ఉన్న మురుగు కాల్వల్లో పూడిక తీయక ఇటీవల కురిసిన తుపాన్ దెబ్బకు నీరు బయటకు పోయే మార్గం లేక రైతులు ఎంత నష్టపోయారో చూశాం. ఇప్పుడు ఏకంగా ఉన్న కాల్వలనే సీఎం సభ కోసం పూడ్చివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 2 వేల బస్సుల్లో జనాన్ని తరలించనున్నారు. ఈ బస్సులు పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోనే పంట పొలాలను తీసుకున్నారు. బస్సులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా పొలం గట్లు, కాలువ గట్లను సైతం యంత్రాలతో తవ్విపడేశారు. కాపుకు వచ్చిన పెసర పంటను సైతం ధ్వంసం చేశారు. రైతులకు పరిహారం ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని రైతులు ఎవరూ ధృవీకరించడం లేదు.
బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధం - ప్రజలతో మమేకానికి జగన్ కొత్త వ్యూహాలు
జాతీయ రహదారి మధ్యలోనే భారీ కటౌట్‌లు: ముఖ్యమంత్రి సభ కోసం ఏకంగా జాతీయ రహదారిపైనే ట్రాఫిక్ మళ్లించారు. విశాఖ నుంచి చెన్నై మార్గంలో వెళ్లే వాహనాలు కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లించి మచిలీపట్నం వైపు మళ్లించారు. హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి వైపు మళ్లించగా, నెల్లూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్లించనున్నారు. జాతీయ రహదారి మధ్యలోనే భారీ కటౌట్‌లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సభకు జనాన్ని తరలించేందుకు పాఠశాల బస్సులను ఇవ్వాల్సిందేనంటూ 7 జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలకు హుకుం జారీ అయ్యింది. దీంతో ఏకంగా పాఠశాలకు సెలవులిచ్చి మరీ బస్సులను అప్పగించాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి సభకు బస్సులను పంపించడం వల్ల పాఠశాలలకు సెలవు ఇవ్వాల్సి వచ్చిందని వచ్చిన సంక్షిప్త సందేశం చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. కావాలంటే శనివారం సెలవు ఇచ్చి ఆదివారం పాఠశాల నిర్వహించుకోండని అధికారులు ఉచిత సలహా ఇచ్చారని యాజమాన్యాలు వాపోతున్నాయి. జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్ పరీక్షనే వాయిదా వేస్తే, పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఒక లెక్కా అంటున్నారు. 11 జిల్లాల్లోని డిపోల నుంచి 1,357 ఆర్టీసీ బస్సులను సైతం సభ కోసం తరలిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల తేదీలను సైతం విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయో చూసి దానికి అనుగుణంగా నిర్ణయిస్తారు. కానీ రాజకీయ సభ కోసం పరీక్షనే వాయిదా వేసిన ఘనత జగన్‌కే దక్కింది.
మళ్లీ అవే అబద్ధాలు చెప్పిన జగన్ - మొత్తం ప్రసంగంలో అదొక్కటే నిజం