Union Govt Special Assistance for Capital Investment: రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (SACI) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడతగా రూ. 15 వందల కోట్లు విడుదలయ్యాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నిధుల కోసం దిల్లీ వెళ్లి ప్రయత్నించారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఇందుకు నిధులు ఇస్తుంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరుస్తుంది.
పర్యాటక హబ్‌గా అమరావతి - రూ. 500 కోట్లతో ప్రణాళికలు - Amaravati Tourism Development
సాకి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2వేల 200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పథకం కింద రూపొందించిన విధివిధానాల ప్రకారం ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదం తెలుపుతుంది. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 66 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆ మేరకు తొలి విడతగా 15 వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ నిధులను ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో ఉన్నాయి. గుత్తేదారులు అనేకమంది ఈ కారణంగా చేతులెత్తేశారు. ప్రస్తుతం వచ్చే నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి పనులను ముందుకు నడిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
అమరావతిలో బ్యాంకుల ప్రతినిధి బృందాల పర్యటన: రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు ఈ రెండు బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించనున్నాయి. ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు.
మధ్యలో మూడు రోజులు రాజధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ఆర్థిక వనరులకు అవకాశం, దశల వారీగా ప్రణాళికలు ప్రభుత్వం, సీఆర్డీఏ పరంగా వాటి అమలు తదితర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. వరల్డ్ బ్యాంకు బృందంలో 23 మంది, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు.
వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఇవాళ భేటీ అవుతారు. అనంతరం ముఖ్యమంత్రితో సచివాలయంలోనే అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక ఆలోచనలు, ఆర్థిక సాయం, ప్రణాళికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, విధానపరమైన కార్యాచరణపై బృందానికి ముఖ్యమంత్రి వివరించనున్నట్లు తెలిసింది.
అమరావతి నిర్మాణం స్పీడప్ - ప్రతి సెంటు భూమి తీసుకోవాలని నిర్ణయం - Capital Amaravati Construction