Transport Department Transfers Issue in AP : ఐదేళ్లుగా ఒకేచోట పని చేస్తుంటే బదిలీ చేసేలా అన్ని శాఖలకూ ఆర్థికశాఖ ఈ నెల 17న (ఆగస్టు 17న) మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, రవాణాశాఖలోని కొందరు మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ల (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల్ (ఏఎంవీఐలు) లాబీయింగ్ మొదలుపెట్టారు. ఒకే చోట రెండేళ్ల సర్వీసు ఉంటే బదిలీ చేయొచ్చంటూ ఈ నెల 23న (ఆగస్టు 23న) ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయించుకున్నారు. దీని వెనక సొమ్ము బాగానే చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
రాబడి కోసం పెట్టుబడి : ఐదేళ్లు దాటిన వారినే బదిలీ చేస్తే తాము అనుకున్నచోట పోస్టింగ్ రాదని గుర్తించిన దాదాపు 40 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రాబడి ఉండే చోట పోస్టింగ్ కోసం తలా రూ.15 లక్షల చొప్పున పెట్టేలా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇలా రూ.6 కోట్లు వసూలుచేసి, సంబంధిత శాఖ మంత్రికి, ఉన్నత అధికారులకు ఇవ్వాలని చెబుతున్నారు.
సచివాలయంలో రవాణాశాఖ వ్యవహారాలు చూసే ఓ అదనపు కార్యదర్శి వీరికి సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెండేళ్లు ఒకేచోట పనిచేస్తే బదిలీ చేయొచ్చని, పోస్టింగ్ కోసం ఒక్కొక్కరు ఐదు స్థానాలకు ఆప్షన్ ఇవ్వొచ్చంటూ ఈ నెల 23న (ఆగస్టు 23న) ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఆ శాఖ పేషీలో కాకుండా, వేరేచోట రూపొందించి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో సంతకం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
కమిషనర్‌తో తకరారు: కొత్త మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు చేయాలంటూ రవాణాశాఖలోని కొందరు పట్టుబడుతున్నారు. కానీ, తాను మాత్రం ఆర్థికశాఖ తొలుత ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తానని రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో కమిషనర్‌కు, ఎంవీఐల సంఘానికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఎంవీఐలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చినా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తగ్గేది లేదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రవాణాశాఖ చెక్ పోస్టులన్నింటినీ తొలగించి రాబడికి గండికొట్టారని, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీకి ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయించి ఆ రూపంలో ఆదాయం లేకుండా చేస్తారని ఎంవీఐ అధికారులు గుర్రుగా ఉన్నారు. తాజాగా బదిలీల్లో అయినా రాబడి బాగుండే ప్రాంతాలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటే దానికి కమిషనర్ అడ్డుపడుతున్నారని ఆగ్రహిస్తున్నారు. 2022లోనూ ఇలాగే బదిలీల సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని అప్పటి రవాణాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఒప్పుకుంటే బదిలీ చేసేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుత కమిషనర్‌పై ఒత్తిళ్లు తెచ్చేలా ఎంవీఐల సంఘంలో కొందరు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు.