State Secretariat Employees Union President Venkatarami Reddy Violating Election Code : ఏ ప్రభుత్వ ఉద్యోగైనా రాజకీయ ఉద్యమాలు, కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. పార్టీలకు ఏ విధమైన సహాయమూ చేయకూడదు. పరోక్షంగానూ, మరేవిధంగానూ అండగా నిలవకూడదు. ఎన్నికల్లో ప్రచారం చేయరాదు. తమ పలుకుబడిని ఉపయోగించరాదు. ఇది సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి. వీటికి విరుద్ధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున యథేచ్ఛగా ప్రచారం చేస్తున్నారు. సంఘం నాయకుడిగా ఆన్‌డ్యూటీలో ఉంటూ అధికార పార్టీకి ఓటు వేయాలని, సీఎం జగన్‌ను మరోసారి గెలిపించాలని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు.
ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు "మన ప్రభుత్వం-మన ప్రగతి కార్యక్రమం" చేపట్టామంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అధికార పార్టీ తరఫున ప్రకటన చేశారు. వైయస్‌ఆర్ జిల్లాలో ఆదివారం బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో ఆ సంఘ నాయకుడు చంద్రయ్యతో కలిసి వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల మేలు జరిగిందంటూ చెప్పుకొచ్చారు. సివిల్ సర్వీసుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి యథేచ్చగా ఆయన వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకు ఓటు వేయాలని, జగన్‌ను మరోసారి గెలిపించాలని బరితెగించి ప్రచారం నిర్వహిస్తున్నారు.
చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి మార్చి 7న నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. గత పాలకులు ఎవరూ చేయనంత మేలు జగన్ చేశారని, ఆయనకే ఉద్యోగులు మద్దతు పలకాలని భజన చేశారు. ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే పంథా కొనసాగించారు. అనంతపురంలో మార్చి 8న నిర్వహించిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులారా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచండంటూ కరపత్రాలు విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మార్చి 10న నిర్వహించిన ర్యాలీ తర్వాత ఉద్యోగుల్ని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శివారెడ్డి, పురుషోత్తంనాయుడు కొత్తగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక గత ఫిబ్రవరిలో జరిగింది. నెల రోజులు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ సమయంలో సన్మాన కార్యక్రమాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి హాజరు కావాలని వ్యూహం రచించారు. అయితే, మాజీ అధ్యక్షులను ఆహ్వానిస్తే అందరినీ పిలవాలనే డిమాండ్ రావడంతో ఆయన కొంత తగ్గారు. ఉద్యోగులతో సమావేశమైనప్పుడు ఏం మాట్లాడాలనే స్క్రిప్టు మాత్రం ఆయన నుంచే ఏపీ ఎన్జీవో నేతలకు వస్తున్నట్లు విమర్శలున్నాయి. ఉద్యమాలతో ఎన్నో సాధించామని, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ డబ్బులను ప్రభుత్వం చెల్లించిందంటూ నాయకులు సన్మాన కార్యక్రమాల్లో చెబుతూ వైఎస్సార్సీపీకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప సమావేశాలు పూర్తికాగా మంగళవారం గుంటూరు, విజయవాడ సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తున్నారు. రాత్రికి విందు ఉందంటూ ఇప్పటికే సమాచారాన్ని ఉద్యోగులకు పంపారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ తతంగం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఈ సన్మానాలపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తంనాయుడి కుమారుడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు.
ఎన్నికల వేళ ఈ మీటింగ్లేలా ? బాధ్యతా - స్వామిభక్తా ? - PraveenPrakash Meeting with Parents
ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలోని సచివాలయం నాలుగో బ్లాక్‌లో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి మార్చి 26న విలేకర్ల సమావేశం పెట్టి చేసిన రాజకీయ విమర్శలు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేయిస్తే ఆ నెపాన్ని టీడీపీపైకి నెట్టేలా ఆదివారం నాడూ ఆయన విమర్శలు గుప్పించారు. పెన్షన్‌తో పాటు సలహాదారుగా జీతభత్యాలు తీసుకుంటూ వైఎస్సార్సీపీ నాయకుడిగా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏపీ ఎన్జీవో హోంను గతంలో విక్రయించారు. ఈ అమ్మకంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వైఎస్సార్సీపీలో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సలహాదారు మద్దతుతో చంద్రశేఖరరెడ్డి భారీగా లబ్ధి పొందినట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవల ఈయన హైదరాబాద్‌లో 4న్నర కోట్లతో ఇల్లు కొనడం, 90లక్షలతో ఖరీదైన ఆడి కారు కొనడంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "సకల శాఖల మంత్రి" ద్వారా ఇన్ని ప్రయోజనాలు పొందినందుకు చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్సీపీకు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఏపీలో ఏపీ ఎన్జీవో సంఘం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల్లోనూ చంద్రశేఖరరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసును తిరగ తోడకుండా ఉండేందుకు వైఎస్సార్సీపీకు సహాయం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కొందరు వీసీలు విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు నిలయంగా మార్చేస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా జరిగే సమావేశాలకు ఆడిటోరియాలను ఇవ్వడమే కాకుండా విద్యార్థులను సరఫరా చేస్తున్నారు. జేఎన్టీయూ-కాకినాడలో జనవరి 30న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 'జగనన్న కాలేజ్ కాప్టెన్స్' పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి వర్సిటీ వీసీ ప్రసాదరాజు సెనేట్ హాల్‌ను ఇచ్చారు. సీఎం ఫొటోతో ఉన్న టీషర్టులను విద్యార్థులకు పంచి, వారితో జగన్‌కు జై కొట్టించారు. వైఎస్సార్సీపీ ప్రచారంకోసం ముద్రించిన పుస్తకాలు, కరపత్రాల్ని పంచిపెట్టారు. వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను ముద్రించారు. ప్రతిపక్షాలపైనా విమర్శలు చేశారు.
జేఎన్టీయూ-కాకినాడలోనే ఫిబ్రవరి 9న వైఎస్సార్సీపీ అనుకూల ప్రచార సభ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని ప్రచారం చేయాలని, వ్యతిరేకించే వారికి పదేపదే చెప్పాలంటూ వక్తలు వైఎస్సార్సీపీ భజన చేశారు. ఈ సమావేశానికి మందిరం అందించడంతోపాటు వీసీ ప్రసాద్ రాజు వక్తగానూ పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో ఫిబ్రవరి 5న ప్రగతి బాటలో రాష్ట్ర విద్యావ్యవస్థ పేరిట నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆంధ్ర వర్సిటీ ప్రొఫెసర్ షారోన్‌రాజు మాట్లాడారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కొందరు కళ్లుండీ చూడలేని ధ్రుతరాష్ట్రులకు, చదువంటే గౌరవం లేని వ్యక్తులకు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యా రంగంలో పురోగతిపై ఎవరైనా దమ్మూ ధైర్యముంటే ఆధారాలతో తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశానికి ఆంధ్ర వర్సిటీ నుంచి విద్యార్థులను తరలించారు.
ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి వైఎస్సార్సీపీ నేతగా వ్యవహరిస్తున్నట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ తెరవెనుక రాజకీయ వ్యవహారాలు సాగిస్తున్నట్లు విమర్శలున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆమెకు మద్దతుగా వర్సిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపకులపతులు, ప్రొఫెసర్లపై ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా ఉన్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.