Samineni Udayabhanu Resign to YSRCP and Join Janasena: తనలోని జనహితమే తనను జనసైనికుడిగా మారేందుకు ప్రేరేపిస్తోందని తన నాయకత్వాన్ని అభిమానించే వారంతా తనతో కలిసి రావాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. 13 ఏళ్ల పాటు వైఎస్సార్సీపీలో సాగిన ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ఒంటెత్తు పోకడలకు విసిగి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శుభమస్తు కళ్యాణ మండపంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. తన అభిమానులు, నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధుల అంగీకారంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను చూపారు.
వైఎస్‌కు ఎంతో సన్నిహితంగా మెలిగిన తాను, ఆయన మీద ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీలో చేరానని సామినేని తెలిపారు. వైఎస్సార్‌కి, జగన్‌కి ఏమాత్రం పోలికలు లేవని సామినేని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపై నాడు వైఎస్ వెంటనే ఉండేవాడినని కానీ జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అలాంటి అవకాశమే ఇవ్వలేదని అన్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీకి తప్ప పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లేదని అన్నారు. ఓటమి తరువాత కూడా మార్పు చెందని అలాంటి అధినాయకత్వం వద్ద ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేకనే రాజీనామా చేస్తున్నానని ఉదయభాను అన్నారు.
జగ్గయ్యపేట పురపాలక సంఘంలో గెలిచిన వైఎస్సార్సీపీ పాలకవర్గానికి కనీసం తనతో ఫొటో కూడా దిగే అవకాశం కల్పించని వ్యక్తితో కలిసి సాగటం కష్టమని సామినేని తెలిపారు. రెండేళ్లపాటు తాను ఎంత ప్రయత్నించినా కౌన్సిలర్ల కోరిక తీర్చలేకపోయానని అన్నారు. తాను జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. తన చేరిక పట్ల కొందరు వక్రభాష్యాలు చెప్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ పోస్టింగులు పెడుతున్నారని అన్నారు. అలాంటి కుయుక్తులు మానుకోవాలని సామినేని హెచ్చరించారు.
తాను ఎవరినీ పార్టీ మారమని బలవంతం చేయడం లేదని, తన నాయకత్వం, వ్యక్తిత్వంపైన నమ్మకం ఉన్నవారంతా తప్పక తనతో కలిసి వస్తారన్న నమ్మకం ఉందని సామినేని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన కార్యాలయంలోనే కొందరితో కలిసి తాను జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. త్వరలోనే పవన్ కల్యాణ్‌ని జగ్గయ్యపేట ఆహ్వానించి ఇతర చేరికలు ఉండేలా చూద్దామని తెలిపారు.