Public Money For YSR Statues in Idupulapaya : ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు మొత్తం 23. ఇందుకోసం అక్షరాలా రూ.10 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 48 అడుగుల ఎత్తయిన ఒక విగ్రహానికే రూ.7.61 కోట్లు వెచ్చించారు. ఇంకో 22 విగ్రహాలకు మరో రూ.2.39 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడితో సరిపెట్టలేదు. విగ్రహాలకు విద్యుద్దీపాల అలంకరణ, చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో రూ.8 కోట్లు వెచ్చించారు.
మంచినీళ్లప్రాయంగా ప్రజాధనం ఖర్చు : ఇలా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇడుపులపాయలో రూ.18 కోట్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేసింది. ఈ పనులకు సంబంధించి పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ -పాడా ద్వారా రూ.15.43 కోట్లు మంజూరు చేయించారు. పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.14.07 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అర్బన్ గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో రూ.4 కోట్ల వరకు వ్యయం చేశారు.
YSR Statues in Idupulapaya : పనులన్నీ జగన్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టారు. ఇతరులు టెండర్లు వేయకుండా జగన్ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విగ్రహాల ఏర్పాటు, ఇతర పనులకు సంబంధించిన మొత్తం రూ.14 కోట్ల టెండర్‌ను ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్ 4.26 శాతం ఎక్సెస్‌కు దక్కించుకుంది. ఈ క్రమంలోనే మరో డమ్మీ గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్‌జేఆర్ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ వేయించారు. అంతకంటే తక్కువ మొత్తానికి కోట్ చేశారంటూ ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు అప్పగించింది.
ఈ విషయంలో గుత్తేదారు సంస్థకు గత సీఎంఓలోని ఒక ఉన్నతాధికారితోపాటు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఓ ఇంజినీర్ సహకరించారు.ఇడుపులపాయలో పనుల టెండర్ ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్ చేతుల్లోకి వెళ్లినా, పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కొండారెడ్డి పనులు చేయించారు. విగ్రహాల ఏర్పాటు పనులకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా కొండారెడ్డే బెదిరించారన్న ఆరోపణలున్నాయి. ఆయన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టయ్యారు. కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని నాటి ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.
సీఐడీకి ఎమ్మెల్యే బొండా ఉమా ఫిర్యాదు : ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మృతివనంలో వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో చేపట్టిన పనులపై, సమగ్ర విచారణ జరపాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సీఐడీ అదనపు డైరక్టర్ జనరల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2019-24 మధ్య స్మృతివనంలో చేసిన పనులకు సంబంధించి టెండర్ల నుంచి నిధుల వ్యయం వరకు అనేక అక్రమాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్‌ను ఎన్.జనార్దనరావు కన్‌స్ట్రక్షన్స్‌కు ఏకపక్షంగా కేటాయించారని బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
జగన్ పాలనలో అడ్డగోలుగా వైఎస్సార్ విగ్రహాలు- ట్రాఫిక్ సమస్యతో ప్రజల పాట్లు
JAGAN TRIBUTES: వైఎస్ ఘాట్ వద్ద నివాళులు.. పలకరించుకోని జగన్, షర్మిల