Murders and Rapes of SC STs During YSRCP Govt: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ అకృత్యాలపై వైఎస్సార్సీపీ హయాంలోనే సాంఘిక సంక్షేమశాఖ 2023 జులైలో కేంద్రానికి ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగుచూసింది. ఒక్క 2022లోనే ఎస్సీ-ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
59 మంది దళిత, గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2 వేల 893 కేసులు నమోదయ్యాయి. 2021లో 40 మంది ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. 2021లో సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరిగితే తర్వాత ఏడాదికి అది 8కి చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళిత, గిరిజనులపై దాడులను అరికట్టేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
దళితులు, గిరిజనులపై పెరుగుతున్న దాడులు - ఎక్కువశాతం నిందితులు వైసీపీ నేతలే
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏటా జనవరి, జులై నెలల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై హైపవర్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని చట్టం చెబుతోంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఒకే ఒక్కసారి 2021లో నిర్వహించారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై నిర్దేశిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలిచ్చింది.
అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉన్నా దాన్నీ జగన్ సర్కారు సరిగా పట్టించుకోలేదు. 2021లో 64 శాతం కేసుల్లో మాత్రమే 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022 నాటికి అది 62 శాతానికి తగ్గింది. బాధితులకు సహాయ పునరావాసం 7 రోజుల్లో కల్పించాల్సి ఉన్నా 2022లో దాదాపుగా 91 శాతం కేసుల్లో బాధితులకు సత్వర సాయం అందలేదు. మొత్తం 2 వేల 892 కేసులు నమోదయితే 304 కేసుల్లో మాత్రమే తక్షణ సాయం అందించారు.