Ministers Introduced Bills in AP Assembly: శాసనసభ గురువారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మునిసిపల్ లా బిల్లును పురపాలకశాఖ మంత్రి నారాయణ, వస్తు, సేవల సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును హోంమంత్రి అనిత, హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లును మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. వీటిపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది.
ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లులో ఇసుక అక్రమ రవాణా, బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు తరలింపునకు అడ్డుకట్ట వేయడాన్ని అప్పటికప్పుడు పొందుపరుస్తూ హోంమంత్రి అనిత ప్రతిపాదించారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మూడు కీలక తీర్మానాలకు ఆమోదం
శాసనసభ గురువారం మూడు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఏపీ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, చెత్త పన్ను రద్దు, సహజవాయువు వినియోగంపై జీఎస్టీ సవరణ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. లోకాయుక్త పదవీకాలం 5 ఏళ్ల పాటు కొనసాగించడంతోపాటు ఎంపికలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా లేనప్పుడు పార్లమెంట్ సంప్రదాయాల్ని అనుసరించేలా చట్ట సవరణ చేస్తూ ఆర్థికమంత్రి కేశవ్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ ఆమోదించింది.
చెత్త పన్ను రద్దు చేస్తూ ఏపీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి దాదాపు 325 కోట్ల రుపాయల మేర చెత్త పన్ను వసూలు చేసినట్లు చెప్పారు. పన్ను కట్టనివారి ఇళ్ల ముందు చెత్త వేయడం, వాణిజ్య సముదాయాల్లో చెత్త కుమ్మరించడం, నీటి కనెక్షన్ల తొలగింపు లాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.
సహజవాయువు వినియోగంపై జీఎస్టీని 24 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సహజవాయువుపై పన్నును 5 నుంచి 24 శాతానికి పెంచటం వల్ల ఆదాయం కోల్పోయామని మంత్రి పయ్యావుల అన్నారు. ఏపీలో అత్యధిక పన్ను కారణంగా పరిశ్రమలు పొరుగు రాష్ట్రాల నుంచి సహజ వాయువును తెచ్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పన్ను కట్టారని వెల్లడించారు. అందుకే రాష్ట్ర ఆదాయంతో పాటు ప్రజలకు భారం తక్కువ ఉండేలా సహజ వాయువుపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ బిల్లు పెట్టారు.
పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ - అసెంబ్లీకి చేరుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి అభివృద్ధికి భారీగా బడ్జెట్ - పనులకు త్వరలో టెండర్లు