Ministers Fires on Jagan : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఓ వైపు వరదలతో అల్లాడుతుంటే ఆయన మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో జగన్ తీరు చూసి 11 సీట్లైనా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడే పరిస్థితి కనిపించిందని మంతులు వ్యాఖ్యానించారు. ఆయన ఫేక్‌తో పెరిగి అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయం రోజూ రుజువు చేసుకుంటున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు.
అసమర్థ పాలనతో విజయవాడ వరదలకు కారణమైన జగన్‌కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ దుయ్యబట్టారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పరామర్శించడం వదిలేసి నేరాలు చేసి జైలుకెళ్లినవారిని జగన్ పలకరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో తన ప్రమేయం ఉందని జగనే పరోక్షంగా అంగీకకరించారని ఆయనపై విచారణ చేపట్టాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు.
దేశంలో సీఎంగా పనిచేసిన ఏ ఒక్కరూ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బురద రాజకీయం చేయలేదని చెప్పారు. బుడమేరు, డైవర్షన్ కెనాల్, రెగ్యులేటర్ ఎక్కడున్నాయి? గండ్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయి? అని ప్రశ్నించారు. కృష్ణా నది ప్రవాహాలు ఎలా వచ్చాయనే కనీస అవగాహన కూడా లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక ఫేక్‌ను పట్టుకుని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అనగాని మండిపడ్డారు.
"టీడీపీ కార్యాలయంపై దాడిని కూడా సమర్థించుకునే నీచమైన వ్యక్తి. ప్రజలు కష్టాల్లో ఉంటే పంటలను దగ్ధం చేసిన చరిత్ర ఉన్నవారి వద్దకు వెళ్లడం జగన్‌కే చెల్లింది. 6 లక్షల మంది వరదలో చిక్కుకునేందుకు కారణం జగన్ చేసిన పాపాలే. దానికి ఆయన క్షమాపణలు చెప్పాలి." - అనగాని సత్యప్రసాద్, మంత్రి
జగన్‌కు వరద బాధితులు కనిపించడం లేదా? : జైలులో ఉన్న నేరస్తుడిని చూడడానికి వెళ్లిన జగన్‌కు వరద బాధితులు కనిపించడం లేదా అని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. విపత్తుల సమయంలో సామాజిక బాధ్యతను మరచి విమర్శలు చేయడం ఆయనకే చెల్లుతుందని వ్యాఖ్యానించారు. వార్డుకో మంత్రిని, సీనియర్ ఐఎఎస్ అధికారుల్ని నియమించి ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారని చెప్పారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బాధితులకు సర్కార్ అండగా నిలిచి భరోసా ఇచ్చిందన్నారు. విజయవాడలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు 500 నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ కార్యక్రమంలో సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు.
'కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతారో విజయవాడ వరద విపత్తు నిర్వహణే నిదర్శనం. వరద బాధితులకు సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం 700 మంది సైనికుల్ని విజయవాడకు పంపించింది. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం సర్కార్ చర్యలు తీసుకుంటుంది. సీఎం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఇంటింటికీ దాదాపు 2 లక్షల అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేసింది' అని సత్యకుమార్ తెలిపారు.
"వరద బాధిత ప్రాంతాల్లో 200 మెడికల్ క్యాంపుల్ని నిర్వహించాం. 450 మంది సీహెచ్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, 104 మొబైల్ మెడికల్ వాహనాల్లోనూ అన్ని మందులనూ అందుబాటులో ఉంచాం. వరద ముంపు ప్రాంతాల్లో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ఉండేందుకు 900 మంది వైద్య సిబ్బంది యాంటీ లార్వా ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. 5 ప్రైవేట్ వైద్య కళాశాలలు, రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు తీవ్రంగా దెబ్బతిన్న 16 వార్డుల్లో వైద్య సేవలు అందిస్తారు." - సత్యకుమార్ యాదవ్, మంత్రి
వైఎస్సార్సీపీ కుట్రపన్నింది : విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్‌కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. ఓ నిందితుడు జైల్లో ఉంటే హుటాహుటిన బెంగుళూరు నుంచి పరామర్శకు వచ్చారని విమర్శించారు. మరి వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆయన ఏ సాయం చేశారని మండిపల్లి నిలదీశారు.
'అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే జగన్ ఏంచేశారో అందరం చూశాం. బాధిత కుటుంబాలను జగన్ ఏమేర ఆదుకున్నారో అందరికీ తెలుసు. ఆనాడు బాధిత కుటుంబాలకు సొంత నిధులతో హెరిటేజ్ ఫుడ్స్ సాయం చేసింది. సొంత వ్యాపారాల నుంచి జగన్ ఏనాడైనా నిధులు వెచ్చించారా?' అని మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు.