AP Assembly Sessions 2024 Updates : విశాఖపట్నంలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్ ప్రశ్న అడిగారు. దీనికి ఉపముఖ్యమంత్రి, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. విశాఖలో ధూళి కణాల కాలుష్యం ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు. అక్కడ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామని ఆయన చెప్పారు.
ఈ క్రమంలోనే పోర్టుల్లో కొన్ని ప్రైవేట్ బెర్తులు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్ అన్నారు. మరోవైపు పొల్యూషన్ కారణంగా హిందూస్థాన్ గ్యాస్, ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. కాలుష్య కారక పదార్థాలన్ని బహిరంగంగానే కన్పిస్తున్నాయని చెప్పారు. పొల్యూషన్ ఎంత మేర ఉందనే విషయం తెలసుకోవడానికి ఎక్విప్మెంట్ పెట్టాలని గణబాబు ప్రభుత్వాన్ని కోరారు.
Pawan Kalyan on Visakhapatnam Pollution : వీటిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటారని గుర్తుచేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సభ్యులు లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. త్వరలో మంత్రి పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని అయ్యన్న కోరారు. దీనిపై స్పందించిన పవన్ త్వరలోనే విశాఖలో పర్యటిస్తానని సమాధానమిచ్చారు. అక్కడ జల, వాయు, శబ్ద కాలుష్యం తగ్గించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కట్టుబడి ఉన్నాం: మరోవైపు ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే 2016 నుంచి 2024 వరకూ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కొంతమందికి ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ పథకంపై వివిధ శాఖలతో చర్చించి సభలో మరోసారి వివరాలు తెలియజేస్తానని నాదెండ్ల వెల్లడించారు
రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు : మరోవైపు త్వరలోనే రైతులకు రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను చెల్లిస్తామని నాదెండ్ల మనోహర్ వివరించారు. అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను, రైతు సహయకేంద్రాలుగా మార్చుతామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి కాకినాడలోని అన్నదాతలకు హామీ ఇచ్చిన విధంగా టార్పాలిన్లను కార్పోరేషన్ నుంచి ఉచితంగా అందించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అక్టోబర్‌లో రహదారులకు మరమ్మతులు : రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, తదితరులు ప్రశ్నలు వేశారు. వీటికి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానమిచ్చారు. గత సర్కార్ ఏపీలోని రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్డీబీ ద్వారా గతంలో రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. కానీ ప్రభుత్వం డబ్పులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ముగిసిన వెంటనే అక్టోబర్‌లో రహదారులకు మరమ్మతులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
పర్యావరణహిత టూరిజానికి పెద్దపీట వేస్తాం : గడచిన ఐదేళ్లుగా ఒడిదుడులకు లోనైన పర్యాటకాన్ని పునరుద్ధరించేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యావరణహిత టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాలను సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పోలవరం పనులు వెనకబడటానికి కారణం జగన్: మంత్రి నిమ్మల - Ministers Fires on Jagan