NO More YSRCP in chilakaluripet: కొద్ది రోజులుగా కాక రేపుతోన్న చిలకలూరిపేట రాజకీయం కొత్త మలుపు తిరిగింది. అభ్యర్థులతో ఆటాడుకుంటోన్న అధికార వైసీపీకి స్థానికంగా ఊహించని భారీ షాక్ తగిలింది. అవమాన భారం, అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ సీనియర్ నాయకులు, ఇంతకాలం పెద్దదిక్కుగా ఉన్న మల్లెల రాజేష్‌నాయుడు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పసుపుకండువా కప్పుకున్నారు.
రాజేష్ నాయుడితో పాటు లోకేశ్ సమక్షంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్, 10 మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో చిలకలూరిపేటలో వైసీపీ భారీ కుదుపునకు లోనయింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న మంత్రి విడదల రజినీపైనా కొన్ని రోజుల క్రితమే సంచలన ఆరోపణలు చేశారు రాజేష్ నాయుడు. కొన్ని నెలల క్రితం వరకు వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్న ఆయన మంత్రి రజిని రూ. 6.5 కోట్లు డబ్బు తీసుకుని మోసం చేశారని వెల్లడించారు. అదే విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల వద్ద పంచాయితీ కూడా జరిగిందని బాంబు పేల్చారు.
జగన్‌కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ- లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురాజు సతీమణి
అనంతరం పరిణామాల్లోనే ఆకస్మికంగా చిలకలూరిపేట అభ్యర్థిని మార్చిన సీఎం జగన్ రాజేష్ నాయుడు స్థానంలో కావటి మనోహర్ నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. అప్పట్నుంచి చిలకలూరిపేటలో మౌనంగా ఉన్న రాజేష్ నాయుడు అనుచరులు, సన్నిహతులతో చర్చల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. గెలిచే వైపు నిలబడాలని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి వైసీపీ అధిష్ఠానానికి ఝలక్ ఇచ్చారు రాజేష్ నాయుడు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి తనతో పాటు ఎంతోమంది నాయకులు దోహదపడ్డారన్నారు.
అన్యాయాన్ని భరించలేకే: కొంతకాలంగా అక్కడ జరుగుతున్న విపరీత పరిణామాలు, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై విసిగిచెంది తమకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని భరించలేకే వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. ఐదేళ్లుగా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని భూదందాలు మొదలు, నిరుపేదలు, చిన్న చిన్న వ్యక్తుల పొట్టకొట్టడం కూడా జరిగిందన్నారు. ఆ తర్వాతే చిలకలూరిపేటలో గెలవడం అసాధ్యం, అక్కడ ఎందుకు పనికిరానని తెలుసుకొని గుంటూరు పశ్చిమలో సీటు సాధించుకున్నారన్నారు.
కానీ ఆమె తిరిగి చిలకలూరిపేటలో కూడా పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు రాజేష్ నాయుడు. ఇక్కడ ఆమె పెత్తనాన్ని సహించేది లేదని తామంతా ముక్తకంఠంతో విభేదించాం అన్నారు. స్థానికనేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఖాతరు చేయకుండా వైసీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించామని రాజేష్ నాయుడు తెలిపారు.
భీమిలిలో వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలో భారీ చేరికలు
స్థానిక వ్యక్తికే సీటు కేటాయించాలని ఎన్నోసార్లు కోరిన పట్టించు కోలేదన్నారు. అందుకే మన చిలకలూరిపేటను మనమే బాగుచేసుకోవాలనే ఉద్దేశంతో మనది చిలకలూరిపేట నినాదంతో ప్రత్తిపాటి పుల్లారావును బలపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రంలో కూడా వైసీపీకి భవిష్యత్తు ఉండదని, వైసీపీ విధానాలతో విసిగెత్తిపోయిన జనం తిరుగుబావుటా ఎగురవేస్తున్నారని రాజేష్ నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు, యుతను దృష్టిలో పెట్టుకుని వీరంతా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు అనేకమంది చొరవ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు, లోకేశ్, పవన్, మోదీకి బహుమతిగా అందిస్తామన్నారు. రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజేష్ నాయుడిని నియమిస్తూ రెండ్రోజుల్లో ఉత్తర్వులు ఇస్తారని అన్నారు. వైసీపీ ఖాళీ అవుతుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన స్పష్టం చేశారు.